కరోనా మహమ్మారిపై పోరాటంలో టీకా నుంచి ప్రభావవంతమైన రక్షణ లభిస్తుందని, ఈ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించడంలో వైద్య సిబ్బంది, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి వారిలో చైతన్యం తీసుకురావాలని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
మంగళవారం బెంగళూరులో కర్ణాటక రాష్ట్ర ప్లానింగ్ విభాగం మరియు ‘గివ్ ఇండియా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘వాక్సినేట్ ఇండియా’ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల్లో టీకా విషయంలో ఎన్నో అపోహలు, ఆందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. దీంతోపాటుగా టీకాకరణకు సంబంధించి చక్కర్లు కొడుతున్న అవాస్తవాలు, అపనమ్మకాలను తొలగించేందుకు మీడియా మరింత చొరవతీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా కరోనా నుంచి రక్షణ కోసం ఐదు సూత్రాలను ఆయన సూచించారు. మాస్కు ధరించడం, సురక్షిత దూరాన్ని పాటించడం, శారీరక వ్యాయామం, యోగ లాంటి వాటిని నిత్యం చేయడం, సంప్రదాయవంతమైన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవడం లాంటి ఐదు సూత్రాల ద్వారా కరోనా నుంచి ఉత్తమ రక్షణ పొందవచ్చని తెలిపారు. దీనితో పాటు కరోనా పై పోరును ప్రజా ఉద్యమంగా మలచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడిన ఆయన,
టీకా ద్వారానే కరోనా వైరస్ నుంచి ప్రభావవంతమైన రక్షణ లభిస్తుందన్న ఉపరాష్ట్రపతి, ఒకవేళ వైరస్ సోకినప్పటికీ తీవ్రత తక్కువగా, ఆసుపత్రి పాలయ్యే అవకాశాలు స్వల్పంగా ఉంటాయని తెలిపారు. మహమ్మారి కారణంగా నెలకొన్న ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, అందుకోసం ప్రజలు అలసత్వాన్ని వీడి, చేతులు కడుక్కోవడం, మాస్కు ధరించడం, సురక్షిత దూరాన్ని పాటించడం వంటి కరోనా జాగ్రత్తలను పాటించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. వీటి పట్ల అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు, కళకారులు, సినీ-క్రీడా ప్రముఖులు చొరవ తీసుకోవాలని సూచించారు.
వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు టీకాకరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేస్తున్న కృషిని ఉపరాష్ట్రపతి అభినందించారు. ఇప్పటివరకు 58 కోట్ల మందికిపైగా టీకాకరణ పూర్తయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రానికి అందుతున్న టీకాలను మరింత పెంచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో, వెంటనే ఉపరాష్ట్రపతి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయాకు ఉపరాష్ట్రపతి ఫోన్ చేసి, సమస్యను వివరించారు. రాష్ట్రానికి టీకాలను 25 శాతం మేర పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు. ఉపరాష్ట్రపతి సలహా మేరకు, టీకాల శాతాన్ని పెంచుతామని కేంద్ర మంత్రి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్, ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మయ్, రాష్ట్ర మంత్రులు డాక్టర్ కె. సుధాకర్, మునిరత్న నాయుడు, పార్లమెంట్ సభ్యుడు పి.సి.మోహన్, రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ షాలిని రజనీష్, గివ్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అతుల్ సటీజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.