9.8 C
New York
Monday, December 4, 2023

Buy now

HomeTrending NewsTelangana-1: నడి బజారులో తెలంగాణ ఓటరు... ఒకటో భాగం

Telangana-1: నడి బజారులో తెలంగాణ ఓటరు… ఒకటో భాగం

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణలో మూడో దఫా ఎన్నికలు కావటంతో యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తోంది. తెలంగాణ ఓటరు ఎవరికి  పట్టం కడతాడో అని….ఏ పార్టీకి అవకాశం ఉందని విశ్లేషణలు జరుగుతున్నాయి. పార్టీల పరంగా చూస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిల మధ్యనే ప్రధాన పోటీ ఉంది. ఎంఐఎం ఉన్నా ఎవరు అధికారంలోకి వస్తే వారితో అంటకాగటం ఆ పార్టీ నాయకత్వ నైజం.

బీఆర్ఎస్ మూడో దఫా గెలుస్తుందని… హాట్రిక్ సాధిస్తామని ముఖ్య నేతలు ధీమాగా ఉన్నారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలే పార్టీకి అండ అని…మేనిఫెస్టోలో చెప్పని ఎన్నో పనులు చేశామని చెప్పుకుంటున్నారు. గులాబీ నేతల ప్రచార శైలి సైతం…అన్నీ చేశాం ఇక ఓటెయ్యండి అన్న రీతిలో సాగుతోంది. తెలంగాణ వచ్చాక సిఎం కెసిఆర్ మాటల్లో మంచితనం…చేతల్లో ముంచే గుణం ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అధికార,విపక్షాల మాటలు క్రమంగా సగటు ఓటరుకు అర్థం అవుతున్నాయి.

కాంగ్రెస్ ను గెలిపిస్తే అధోగతే… కరెంటు రాదు…రైతుబందు రాదు..సమస్యల సుడిగుండంలోకి తెలంగాణ వెళుతుందని ప్రజలకు చెపుతున్నారు. సావధానంగా వింటున్న ప్రజలు కారు మళ్ళీ గెలిస్తే…కాంగ్రెస్ గెలిస్తే ఎలా ఉంటుందనే మీమాంసలో ఉన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పే కెసిఆర్ భూముల రిజిస్ట్రేషన్ ధరలు అమాంతం పెంచారు.

సామాన్యులకు అందుబాటులో లేని భూముల ధరలు అభివృద్దికి కొలమానమా? కెసిఆర్ తో పోలిస్తే ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు కొంత ఉదారంగా వ్యవహరించారనే చర్చ జరుగుతోంది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ భూములు కనిపిస్తే వాటిని అమ్మటమే పనిగా పెట్టుకున్నారు. హైదరాబాద్ శివార్లలో ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి.

హైదరాబాద్ చుట్టుపక్కల వందల ఎకరాల సర్కారు భూములు ప్రైవేటు వ్యక్తుల పరం అయ్యాయి. 111 జీవో ఎత్తివేత ఎవరికీ మేలు చేసేందుకు. కొన్ని సవరణలు చేసి కొంత ప్రాంతానికి మినహాయింపు ఇవ్వాల్సింది. మొత్తం రద్దు చేస్తామని చెప్పటం బడాబాబులను మెప్పించేందుకు కాదా అని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. సర్వోన్నత న్యాయస్థానం కూడా జీవో రద్దుకు సానుకూలంగా తీర్పు ఇవ్వటం…అందుకు దారితీసిన సమీకరణాలపై వస్తున్న వార్తలు, ఆరోపణలు ప్రజలకు బోధపడుతున్నాయి.

ముంబై నగరంలో సామాన్యులు కొంత సొమ్ము కడితే ప్రభుత్వం దానికి కొంత జతచేసి ఇల్లు కట్టిస్తున్నాయి. లక్కీ డ్రా ద్వారా ఎంపిక జరుగుతోంది. ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పేరుతో పెద్ద ప్రహాసనమే జరుగుతోంది. పది శాతం పేదలకు ఇచ్చి 90 శాతం అధికార పార్టీ కరుణా కటాక్షాలు ఉన్నవారికే దక్కాయని అంటున్నారు.

మంత్రి కేటిఆర్ విదేశీ పర్యటనలతో ఐటి కంపనీలు, పరిశ్రమలు అనేకం వస్తున్నాయి. వాటిలో స్థానికులకు దక్కిన ఉద్యోగాలు ఎన్నో శ్వేత పత్రం విడుదల చేస్తే నిజ నిజాలు ప్రజలకు అవగతం అవుతాయి. తొమ్మిదన్నర ఏళ్ళు పరిపాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం… అభివృద్ధి చూసి ఓటు వేయాలని అడుగుతున్నా… ఇప్పుడు కూడా కాంగ్రెస్ నే బూచిగా చూపటం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో…ఓటరు మనోగతం చూడాలి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్