Sunday, January 19, 2025
HomeTrending Newsకేరళలో వరుసగా రెండోరోజూ 30 వేల కేసులు

కేరళలో వరుసగా రెండోరోజూ 30 వేల కేసులు

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న అమాంతం పెరిగిన కొత్త కేసులు.. ఈ రోజు 3 శాతం మేర క్షీణించాయి. మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. కేరళలో వైరస్‌ ఉద్ధృతి, రికవరీల విషయంలో మాత్రం ఆందోళన వ్యక్తం అవుతోంది. 24 గంటల వ్యవధిలో నమోదైన కరోనా గణాంకాలను శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది.

తాజాగా 18,24,931 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 44,658 కొత్త కేసులు వెలుగుచూశాయి. నిన్న మరో 496 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దాంతో  ఇప్పటి వరకూ మొత్తం కేసులు 3.26 కోట్లకు చేరగా.. 4,36,861 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో మహమ్మారి విజృంభిస్తోంది. వరుసగా రెండోరోజు 30వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 162 మంది ప్రాణాలు విడిచారు. మూడో ముప్పుపై ఆందోళన వ్యక్తం అవుతోన్న నేపథ్యంలో కేరళ పరిస్థితిపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.

నిన్న 32,988 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొద్ది రోజులుగా రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు క్రియాశీల కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం 3,44,899 మంది వైరస్‌ బారిన పడి, చికిత్స పొందుతున్నారు. క్రియాశీల రేటు మళ్లీ 1 శాతం దాటి.. 1.06 శాతానికి చేరింది. రికవరీ రేటు 97.60 శాతంగా ఉంది. ఇప్పటివరకు 3.18 కోట్ల మంది వైరస్‌ను జయించారు.

61 కోట్ల టీకా డోసుల పంపిణీ..జనవరిలో ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం కింద నిన్నటివరకు 61.22 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 79,48,439 మంది టీకా వేయించుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్