Sunday, January 19, 2025
HomeTrending Newsతాలిబన్లకు పశ్చిమ దేశాల షరతులు

తాలిబన్లకు పశ్చిమ దేశాల షరతులు

ఆఫ్ఘనిస్తాన్ లో విద్యార్థునుల కోసం పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించాలనే డిమాండ్ పెరుగుతోంది. తాలిబన్లు కాబూల్ వశం చేసుకుని రెండు నెలలు గడుస్తున్నా  బాలికల విద్యపై ఇంకా విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు. పరిపాలన పగ్గాలు చేపట్టిన కొత్తలో విద్య, ఉద్యోగాల్లో మహిళల హక్కులకు భంగం వాటిల్లదని హామీ ఇచ్చిన తాలిబన్లు వెనువెంటనే మాట మార్చారు. క్రమంగా బాలికల పాఠశాలలు ముసివేయటం, పని ప్రాంతాల్లోకి మహిళా ఉద్యోగులు రాకుండా అడ్డంకులు సృష్టించారు. దేశంలో ప్రధాన నగరాల్లో రెండు నెలలుగా మహిళలు, బాలికలు ఇంటికే పరిమితం అయ్యారు. బాల్ఖ్, కుందుజ్, సర్ ఐ పుల్ తదితర ప్రాంతాల్లో మాత్రం పాఠశాలలకు బాలికలు వెళ్ళగలుగుతున్నారు. రాబోయే శీతాకాలంలో వాతావరణం దుర్భరంగా ఉంటుందని పాఠశాలకు వెళ్లి చదువుకోవటం కష్టమని హక్కుల సంఘాలు అంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయని తొందరగా ప్రారంభిస్తే మేలు జరుగుతుందని విద్యార్థునుల తల్లిదండ్రులు కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు.

తాలిబాన్ల తీరుపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటేరాస్ అసహనం వ్యక్తం చేశారు. విద్యా,ఉద్యోగ  రంగాల్లో మహిళలకు ఇచ్చిన హామీల్ని తాలిబన్లు నిర్లక్ష్యం చేస్తున్నారని గుటేరాస్ విమర్శించారు. ప్రపంచ దేశాల్లో ఆఫ్ఘన్ మహిళలకు అవకాశాలు దక్కకుండా తాలిబన్లు అవివేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తాలిబన్లు తమ పాలనకు గుర్తింపు సాధించాలనుకుంటే అన్ని రంగాల్లో మహిళలకు సమాన హక్కులు కల్పించాలని సూచించారు.

తాలిబన్లు పాలనలోకి వచ్చాక ఆఫ్ఘానిస్తాన్ కు సంబంధించిన ఆర్ధిక లావాదేవిల్ని అనేక దేశాల్లో బ్యాంకులు స్తంభింప చేశాయి. ఆయా దేశాల ఆదేశాలకు అనుగుణంగా బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ బ్యాంకుల్లోని నిల్వలను వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని తాలిబన్లు కోరుతున్నారు. వీటికి సంబంధించి అమెరికా, యూరోపియన్ దేశాల ప్రతినిధులతో తాలిబాన్ల ప్రతినిధులు దోహలో సమావేశమయ్యారు. మహిళలు, విద్యార్థునులు, మానవ హక్కుల పరిరక్షణపై హామీ ఇస్తేనే తాలిబాన్ల డిమాండ్లు నెరవేర్చగలుగుతామని పశ్చిమ దేశాలు తెగేసి చెప్పాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్