దేశంలో జనాభా గణన కులాల వారిగా జరగాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటివరకు ములాయం సింగ్ యాదవ్, లాలు ప్రసాద్ యాదవ్ లాంటి నేతలే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తాజాగా బిజెపి మిత్రపక్షం జనతాదళ్ యు కూడా డిమాండ్ చేసింది. జనాభా గణన కులాల వారిగా నిర్వహించాలనే డిమాండ్ తో ప్రధానమంత్రిని కలువనున్నట్టు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమస్తీపూర్ లో ప్రకటించారు. బీహార్ ప్రతిపక్షాలతో పాటు కలిసి వచ్చే ఇతర పార్టీలతో వెళ్లి ప్రధానికి విజ్ఞప్తి చేస్తామని వెల్లడించారు. సోమవారం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా ఖరారైందని, 10 పార్టీల నుంచి ప్రతినిధుల బృందం ఢిల్లీ వెళ్తుందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం కులాల వారి జనాభా గణనకు సమ్మతించకపోతే బీహార్ లో తమ ప్రభుత్వం చేపడుతుందని నితీష్ కుమార్ తెగేసి చెప్పారు. కులాల వారి లెక్కలతో వెనుకపడిన వారిని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశముందన్నారు. దేశంలో అనేక కులాలు అంతరించి పోతున్నాయని, వారి సంస్కృతిని కాపాడాల్సిన ఆవశ్యకత ఉందని నితీష్ పేర్కొన్నారు. ప్రధానమంత్రిని కలిసే బృందంలో రాష్ట్రీయ జనతాదళ్ నుంచి తేజస్వి యాదవ్ కూడా ఉంటారని నితీష్ తెలిపారు.
జనాభా లెక్కలు కులాల వారిగా చేపట్టాలని 2019లోనే బిహార్ శాసనసభ తీర్మానం చేసిందని, 2020 సంవత్సరంలో మరోసారి తీర్మానం చేసిందని సిఎం నితీష్ కుమార్ గుర్తు చేశారు. రెండు దఫాలు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం జరిగిందన్నారు. ఇప్పటి వరకు మొక్కుబడిగా జరుగుతున్న జనాభా గణన తీరు మారాలని, కులాల వారి లెక్కలతో దేశాభివృద్ధి సాధ్యమన్నారు.
వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో జనతాదళ్ యు తలపడే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించి నిర్ణయిస్తామని నితీష్ కుమార్ చెప్పారు.
బీహార్లో వరద బాధిత ప్రాంతాల్లో శనివారం నితీష్ పర్యటించారు. గంగా నది వరద తగ్గు ముఖం పడుతోందని వరద సహాయ చర్యలు ముమ్మరం చేస్తామని, ముంపు బాధితులకు అభయమిచ్చారు.