కొత్త పార్టీలకు తెలంగాణలో స్థానం లేదని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.  తెలంగాణా ప్రజల హృదయాల్లో వైఎస్ వారసులకు అసలే స్థానం లేదన్నారు. అసెంబ్లీలో తెలంగాణా గురించి వైఎస్ అవహేళనగా మాట్లాడారని, తెలంగాణా అడిగితే అదేమైనా బీడీయా, సిగరెట్టా అని ఎగతాళి చేశారని హరీష్ గుర్తు చేశారు. తెలంగాణకు దక్కాల్సిన నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా రాయలసీమకు దోచుకెళ్లారని విమర్శించారు, రాయల తెలంగాణా పేరుతో ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని,  తాను బతికి ఉండగా తెలంగాణ రాదని వైఎస్ చెప్పారని హరీష్ రావు వెల్లడించారు. మా నీళ్ళు, నిధులు ఆంధ్ర ప్రదేశ్ కు తరలిస్తున్నందుకు మీకు మద్దతివ్వాలా అంటూ వైఎస్ షర్మిలను సూటిగా ప్రశ్నించారు.

సదాశివపేటలో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు ఆ పార్టీకి రాజేనామే చేసి టిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ  అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. డెబ్భై ఏళ్ళల్లో కాంగ్రెస్, టిడిపి చేయలేని పనులు ఏడేళ్ళలో టిఆర్ఎస్ చేసి చూపించిందన్నారు.  సంగారెడ్డి ఎమ్మెల్యే ఫోన్ ఎత్తడు,అవసరమైనప్పుడు కనీసం స్పందించడని ఆపార్టీ  నాయకులే చెబుతున్నారని అన్నారు.  జులై నెలలోనే కొత్త రేషన్ కార్డు లు ఇస్తామని, త్వరలో 4 వేల కోట్ల రూపాయలతో పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని హరీష్ రావు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *