మణిపూర్ లో అగ్గి రాజుకుని అల్లకల్లోలంగా మారింది. గిరిజన తెగల మధ్య వైషమ్యాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు అదే రీతిగా మేఘాలయలో మొదలయ్యాయి. కాశీ, గారో కొండ ప్రాంతాలతో జరిగిన ఒప్పందం అమలు చేయటం లేదంటూ ఆ ప్రాంత ప్రజలు నిరసనలకు దిగారు. నిరసన కాస్తా హింసకు దారితీసింది.
మేఘాలయా ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా ఆఫీస్‌పై ఆందోళనకారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో తురాలోని సీఎం ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఆందోళనకారుల దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. తురాలో శీతాకాల రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు ఆందోళనకారులు సీఎం కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయంపై రాళ్లవర్షం కురిపించారు. ఆ సమయంలో సీఎం సంగ్మా ఆఫీసులో ఉండటం గమనార్హం. అయితే ఆయనకు ఎలాంటి హానీ జరగలేదు.
ఆందోళనకారులు రోడ్డును దిగ్భందించడంతో సీఎం సంగ్మాతోపాటు ప్రజారోగ్య ఇంజినీరింగ్ శాఖ మంత్రి ఎన్ మరాక్ కూడా ఆఫీస్‌లోనే ఉండిపోయారు. తురాను శీతాకాల రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తూ గారో హిల్స్‌కు చెందిన వివిధ సంఘాలు గత 14 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాయి. దీంతో ఏసీహెచ్‌ఐకే, జీహెచ్‌ఎస్‌ఎంసీ వంటి పౌర సంఘాలతో చర్చలు జరిపేందుకు సీఎం తురా చేరుకున్నారు. ఇరు పక్షాల మధ్య చర్చలు జరుగుతుండగానే ఆందోళనకారులు సీఎం కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నదని అధకారులు తెలిపారు.