ఇస్లామిక్ ఉగ్రవాదులు మాలిలో ఘాతుకానికి పాల్పడ్డారు. అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు. ఆ దేశ సైనిక స్థావరంతో పాటు ప్రయాణికులతో వెళ్తున్న పడవపై అల్ ఖైదా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఉత్తర మాలిలో జరిగిన ఈ ఘటనలో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 45 మంది సామాన్య పౌరులే ఉన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. వేర్వేరు చోట్ల ఉన్న సైనిక స్థావరం, ప్రయాణికుల పడవపై దాడి చేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
తొలి ఉగ్రవాద దాడి నైజర్ నదిలో టింబక్టు పడవపై దాడి చేయగా.. ఆ తర్వాత బాంబాలోని సైనిక స్థావరపై దాడి చేశారు. రెండు దాడుల్లో మొత్తం 49 మంది పౌరులతో పాటు 15 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అల్‌ఖైదాకు చెందిన ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు మాలి రక్షణ వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి.
సపోర్ట్ గ్రూప్ ఆఫ్ ఇస్లాం అండ్ ముస్లిం (GSIM) అల్ ఖైదా అనుబంధంగా మాలి దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2015 సంవత్సరంలో ఉగ్రవాదులతో మాలి ప్రభుత్వం శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 2020 లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి సైనిక తిరుగుబాటుతో కొత్త ప్రభుత్వం వచ్చాక ఇస్లామిక్ ఉగ్రవాదులు మళ్ళీ దాడులకు దిగుతున్నారు. మాలి దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చటమే లక్ష్యంగా ఈ జిహాదీ గ్రూపు పనిచేస్తోంది.