YSRCP:వాటికి కాలం చెల్లింది: అంబటి

చంద్రబాబునాయుడు మేనేజ్మెంట్ రాజకీయాలకు కాలం చెల్లిందని రాష్ట్ర జలనవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇన్నాళ్ళూ ఎన్ని తప్పులు చేసినా, అవినీతికి పాల్పడినా వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకున్నారని, కానీ అలాంటి పరిస్థితులు ఎల్లకాలం సాగలేవని అన్నారు.  బాబు అరెస్టులతో రాజకీయ లబ్ధి పొందాలని టిడిపి ప్రయతిస్తోందని, కానీ బలమైన ఆధారాలు లేకుండా కోర్టులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేవని స్పష్టం చేశారు.

బాబు సుప్రీం కోర్టు లాయర్ సిద్దార్థ లూథ్రా ను తీసుకువచ్చినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని, స్వయంగా బాబు కూడా వాదించుకున్నారన్నారు. ఇదేదో కక్ష సాధింపు అని టిడిపి నేతలు చెప్పడం  సరికాదన్నారు.  ఏవేవో సాంకేతిక ఆధారాలపై మాట్లాడుతున్నారు కానీ అసలు చంద్రబాబు తప్పు చేయదని  ఎవ్వరూ చెప్పడం లేదన్నారు. డబ్బుంటే ఏ వ్యవస్థలనైనా, ఎవరినైనా మేనేజ్ చేయడం అనేది ఇప్పటి వరకూ బాబు ఆచరించిన సిద్ధంతమని, అసలు ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ఇంత ఖరీదు కావడానికి కూడా ఆయనే కారణమని అంబటి ఆరోపించారు. బాబును మొన్న అరెస్టు చేస్తే నేడు బంద్ కు పిలుపు ఇవ్వడం ఏమిటని, అంటే కోర్టు రిమాండ్ విధిస్తూ ఇచ్చిన తీర్పుపై మీరు నిరసన తెలియజేస్తున్నారా అంటూ అంబటి ప్రశ్నించారు.  ప్రజలు ఎవరూ రోడ్లపైకి రావడం లేదని, అందుకే అచ్చెన్నాయుడు కార్యకర్తలు రోడ్లపైకి రావాలని బతిలాలుతున్నారని గుర్తు చేశారు.

తిక్కలోడు తిరునాళ్ళకు వెళితే ఎక్కా దిగా సరిపోయినట్లుందని పవన్ కళ్యాణ్ తీరు ఉందని… బాబు అరెస్టుపై ఆయన అంతగా స్పందించాల్సిన అవసరం ఏమిటని అడిగారు. వారాహి యాత్రలో రాయలసీమ రౌడీలను దించి తమ పార్టీ కార్యకర్తలను యాభై మందిని ఊచకోత కోయడానికి వైసీపీ యత్నించిందని పవన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాయలసీమ వారు రౌడీలని చెబుతున్నారా అంటూ పవన్ ను సూటిగా నిలదీశారు. చట్టం అనే రథచక్రాల కింద తప్పు చేసిన ఎవరైనా నలిగి పోవాల్సిందేనని, అది చంద్రబాబు అయినా, రామోజీ రావయినా ఒకటేనన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *