ఓర్వకల్ మండలం సోమయాజుల పల్లె నుంచి డోన్ వరకూ రూ.630 కోట్ల అంచనాతో జరగనున్న జాతీయ రహదారి నిర్మాణ పనులకు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భూమి పూజ చేశారు. నంద్యాల జిల్లా హనుమంతరాయుని కొట్టాలలో 53కి.మీ నేషనల్ హైవే-340బీని కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. దీనితో పాటు బేతంచెర్లలో రూ.1.2 కోట్లతో నిర్మించిన జగనన్న కాలనీకి రోడ్ కమ్ బ్రిడ్జిని ఆర్థిక మంత్రి ప్రారంభించారు.
విభజన నాటి నుంచి పెండింగ్ లో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తూ పరిష్కరించుకుంటోందని బుగ్గన వెల్లడించారు. దీనిలో భాగంగానే 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ లోటు గ్రాంటు (ఆర్.డీ.జీ) రూ.10,460.87 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడుదల చేసిందని చెప్పారు. ఈ ఉత్తర్వులోని రెండవ పేరాలో పొందుపరిచిన షరతులు సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి సహాయ ఉత్తర్వులో పొందుపరిచే అంశాలేనని బుగ్గన చెప్పారు.
అప్పటి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ టీడీపీవిభజన హామీలతో పాటు రెవెన్యూ లోటు నిధులు సాధించలేకపోయిందని, రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి హామీల అమలుపై కేంద్రాన్ని కోరుతూ, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రధాని, కేంద్ర హోమ్ మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి , నీతి ఆయోగ్ సభ్యులకు, దక్షిణ జోనల్ కౌన్సిల్ మీటింగ్స్ లో వివరిస్తూ వచ్చిందని స్పష్టం చేశారు.
కేంద్రం కోరినసమాచారాన్ని సమర్పించి చట్టప్రకారం రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ లోటు భర్తీ కోసం ఒత్తిడి తెస్తూనే ఉందని తెలిపారు. సిఎం జగన్ గత ఢిల్లీ పర్యటనలో జరిగిన చర్చలు, కొలిక్కి వచ్చి నిధుల విడుదలకు ఆర్థిక శాఖను కేంద్రం ఆదేశించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సాధించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సఫలీకృతమయి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలపరిచి, రాష్ట్ర భవిష్యత్తును కాపాడిందనేది అక్షర సత్యమని బుగ్గన పేర్కొన్నారు.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.