ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ అరాచకాలు ఎక్కువయ్యాయి. లక్షల మంది ప్రజలు దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. కుటుంబాలతో సహా ఇల్లు, ఊరు వదిలి బతుకు జీవుడా అంటూ ఇరాన్, పాకిస్తాన్ లకు తలదాచుకునేందుకు తరలుతున్నారు. అమెరికా, నాటో బలగాలు తిరిగి వెళ్లిపోతుంటే, వెనువెంటనే ఆ ప్రాంతాల్ని తాలిబాన్ లు కైవసం చేసుకుంటున్నారు. ఆఫ్ఘన్ సరిహద్దు జిల్లాలను పూర్తిగా హస్తగతం చేసుకున్నారు. ఈశాన్య రాష్ట్రమైన తఖర్ ప్రావిన్స్ అధీనంలోకి తీసుకున్నారు. 1996 నాటి రోజులు మళ్ళీ మొదలవుతున్నాయి. దేశంలో ఇస్లామిక్ షరియా చట్టం అనుసరించాలని తాలిబాన్ నాయకత్వం ఫర్మాన జారీ చేయటంతో ప్రజలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.
నెల రోజుల్లోనే సుమారు మూడు లక్షల మంది ఆఫ్ఘన్ లు దేశం విడిచి వెళ్లిపోయారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐ.ఓ.ఎం) ప్రకటించింది. అంతర్జాతీయ సమాజం ఆఫ్ఘన్ వ్యవహారంలో జోక్యం చేసుకోపోతే రాబోయే రోజుల్లో పరిణామాలు ఉహించని విధంగా ఉంటాయని వివరించింది. పేదరికం, ఆకలి తట్టుకోలేక అనేక మంది యువకులు తాలిబాన్ లతో చేతులు కలుపుతున్నారని, అమాయక యువకుల్ని ఉగ్రవాదులుగా మార్చే పని వేగంగా జరుగుతోందని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొంది.
కరోనతో వేలమంది ప్రాణాలు వదులుతుంటే, తాలిబాన్ దాడులతో అస్తవ్యస్త వాతావరణం నెలకొంది. ఈ రెండింటి కన్నా ఆకలితో, సరైన వైద్య సదుపాయాలు అందక ఎక్కువ మంది చనిపోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో సుమారు ఇరవై లక్షల జనాభా ఒంటి పుట భోజనంతోనే సరిపెట్టుకుంటున్నారని యుఎన్ పరిశీలనలో బయట పడింది. ప్రపంచ దేశాలు మానవత దృక్పథం తో ఆదుకోవాలని స్వచ్చంద సంస్థలు కోరుతున్నాయి.