అమెరికా ఆంక్షల దెబ్బకు రష్యా విలవిల్లాడుతున్నది. భారత్ సహా దక్షిణాసియా దేశాలు రష్యాకు డాలర్లలో చెల్లింపులు చేయలేకపోతున్నాయి. దీంతో రష్యా వాణిజ్య మిగులు ఆందోళనకర స్థాయికి చేరుకున్నది. భారతీయ బ్యాంకుల్లో రష్యాకు చెందిన వేల కోట్ల రూపాయల నగదు ఉన్నదని, దీనిని అంతర్జాతీయంగా ఏ విధంగానూ వాడలేని పరిస్థితి తయారైందని రష్యా విదేశాంగ మంత్రి సెర్జి లావరోవ్ అన్నారు.
వాణిజ్య మిగులు (ట్రేడ్ సర్‌ప్లస్) భారీగా పెరిగిందని, రష్యాకు ఇదొక సమస్యగా మారిందని తెలిపారు. గోవాలో ఇటీవల జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రూపాయి నగదు నిల్వలు కొండలా పెరుగుతున్నాయి. వీటిని వాడుకోవాలంటే రూపాయి కరెన్సీని మరో కరెన్సీలోకి మార్పిడి చేయాల్సి ఉంటుంది.
ఈ అంశంపై భారత్‌తో చర్చిస్తున్నా’మని ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా ఏకపక్షంగా యుద్ధానికి దిగటంతో అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆయా దేశాల్లో రష్యాకు చెందిన వందల బిలియన్ డాలర్ల నిధుల్ని స్తంభింపజేసింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి భారత్‌కు ముడిచమురు దిగుమతులు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2022-23 మొదటి 11నెలల్లో రష్యా దిగుమతులు 41.56 బిలియన్ డాలర్లు కాగా, రష్యాకు భారత్ ఎగుమతులు 2.8 బిలియన్ డాలర్లకే పరిమితమైంది.