Monday, June 15, 2026
HomeTrending Newsపోలవరంతో భద్రాచలానికి ముప్పు - మంత్రి పువ్వాడ

పోలవరంతో భద్రాచలానికి ముప్పు – మంత్రి పువ్వాడ

పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలడంలో కొంత నిర్లక్ష్యం చేసినందువల్లే భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరిగిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని మొదటినుంచి మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. టీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య,ఎమ్మెల్యే ఎం. నాగేశ్వర్ రావు,ఎమ్మెల్సీ తాత మధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ… కరకట్టలు గతంలో కట్టినా అవి పటిష్టంగా లేవు.. సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం కోసం నిపుణుల కమిటీ ప్రకటించారన్నారు. ముంపునకు గురయ్యే కాలనీ వాసులకు శాశ్వత పరిష్కారం దిశగా సీఎం చర్యలు ప్రకటించారని, వరదలోనూ సీఎం కేసీఆర్ పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారన్నారు. వరదలతో గ్రామాల్లో దెబ్బ తిన్న విద్యుత్ వ్యవస్థను దాదాపుగా పునరుద్ధరించుకోగలిగామని. పారిశుధ్య పరిస్థితిని మెరుగు పరిచేందుకు వివిధ జిల్లాల నుంచి దాదాపు నాలుగు వేల మంది సిబ్బందిని రప్పించామన్నారు. తాగునీటి సరఫరాను పునరుద్ధరించామని, ఇంత స్థాయి వరదల్లోనూ ఒక్క ప్రాణం పోకుండా చర్యలు తీసుకున్నామన్నారు.

వరదల పరిస్థితిని సీఎం ముందే ఊహించి ఈ నెల 13 నుంచే మమ్మల్ని అక్కడ ఉండాలని ఆదేశించారని, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 25 వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం ఇదే మొదటి సారని మంత్రి తెలిపారు. ఇన్ని ఏర్పాట్లు చేసినా మీడియాలో సౌకర్యాల లేమి అంటూ వార్తలు రావడం దురదృష్టకరమన్నారు. పోలవరం కోసం మన ఏడు మండలాలు ఆంధ్రాలో కలపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై ఆది లోనే మేము నిరసన తెలిపామని, కనీసం ఐదు గ్రామలనైనా తిరిగి తెలంగాణలో కలపాలని  మంత్రి డిమాండ్ చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించి బిల్లు ప్రవేశ పెట్టాలన్నారు. గిరిజనులను, గిరిజనేతరులను వరదల నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని, ఒకటి రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన వరద సాయం బాధితుల అకౌంట్ల లో జమ అవుతుందని తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు.. వరదల నివారణకు ఆ ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని, పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక డిజైన్ మార్చి మూడు మీటర్ల ఎత్తు పెంచుకున్నారని ఆరోపించారు. ఎత్తు తగ్గించాల్సిన భాద్యత కేంద్రం మీద ఉందని, బీజేపీ నేతలు కేంద్రం నుంచి సాయం తేకుండా వట్టి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

గుజరాత్ కు వరద సాయం చేసిన కేంద్రం.. తెలంగాణకు ఇప్పటి వరకు సాయం ప్రకటించలేదని, ప్రజలను ఓదార్చేందుకు ఒక్క కాంగ్రెస్, బీజేపీ నేత కనిపించలేదని మంత్రి పువ్వాడ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు తో భద్రాచలం కు ఉన్న ముప్పును నివారించాలని కేంద్రాన్ని కోరారు. ఏపీ నుంచి కూడా ముంపు భాదితులు వచ్చి మా పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నారని, ఐదు గ్రామాల్లోని ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుకుంటున్నారని మంత్రి తెలిపారు.

Also Read : భద్రాచలం, బూర్గంపాడులో 144 సెక్షన్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular