పశ్చిమ బెంగాల్‌లో కొద్ది రోజులుగా ఎండలు ప్రచండ రూపం దాల్చాయి. దీంతో ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. వడ దెబ్బకు సుమారు పది మంది మ్రుత్యువాత పడ్డారు. తాజాగా బెంగాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని ఐదు జిల్లాలో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన సాధారణ వర్షపాతం నమోదయింది. అయితే వర్షంతోపాటు పిడుగులు పడటంతో 14 మంది మృతిచెందారు. వీరిలో పూర్వ వర్ధమాన్ జ్లిలాలో నలుగురు ఉండగా, ముర్షిదాబాద్, ఉత్తర 24 పరగణాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. ఇక పశ్చిమ మిడ్నాపూర్, హౌరా రూరల్ జిల్లాల్లో మరో ఆరుగురు చనిపోయారు.
మృతుల్లో ఎక్కువగా వ్యవసాయ పొలాల్లో పనిచేస్తుండగా పిడుగుపడి చనిపోయినవారే ఉన్నారని పోలీసులు తెలిపారు. దక్షిణ బెంగాల్‌లోని కోల్‌కతా, హౌరా, ఉత్తర 24 పరగణాలు, పూర్వ వర్ధమాన్, ముర్షిదాబాద్ జిల్లాల్లో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి.