Sunday, January 19, 2025
HomeTrending Newsచిరిగిన బూట్లు- లక్షల్లో రేట్లు

చిరిగిన బూట్లు- లక్షల్లో రేట్లు

మా చిన్నతనంలో జీన్స్ అనే వస్త్ర రాజం గురించి హైస్కూల్ దాకా తెలీదు. ఢిల్లీలో ఉన్న కజిన్స్ వచ్చినప్పుడు జీన్స్, కార్డ్ రౌయ్ గురించి తెలిసింది. ఆపైన ఒకటో రెండో కొనుక్కుని ఏళ్లపాటు వాడడం గుర్తే. క్రమేణా ఇతర వస్త్రాల కన్నా జీన్స్ దుస్తులకు ఆదరణ విపరీతంగా పెరిగింది. ఒక్క జీన్స్, నాలుగు షర్టులు ఉంటే నెలరోజులైనా ధీమాగా గడిపేయచ్చనే ఆలోచన పెరిగింది. ఒకనాడు మిలిటరీ అవసరాల కోసం మొదలైన జీన్స్ ఇప్పుడు నిత్యావసరమైంది. కులమత వర్గ భేదం లేకుండా అందరికీ దగ్గరైంది. ఆ తర్వాత కాలంలో జీన్స్ రంగులు మార్చుకుంది. ఎంత వెలిసిపోయినట్టు ఉంటే అంత గొప్ప. స్టోన్ వాష్ జీన్స్ అనేవాళ్ళు. ఈ విపరీతం ఇంకా తీవ్రమై చిరుగుల జీన్స్ ఫ్యాషన్ అయి కూర్చుంది. పైగా ఇవి అదిరిపోయే రేట్లలో ఉంటాయి.

తాజాగా ఈ కోవలో బూట్లు కూడా చేరాయి. బాలెన్సియాగా అనే ప్రముఖ షూ కంపెనీ ఈ మధ్య పారిస్ స్నికర్స్ పేరిట షూ విడుదల చేసింది. వీటి ఖరీదు రెండువేల డాలర్లు మాత్రమే. ప్రత్యేకత ఏమిటీ అంటారా? పాడయిపోయి ఎందుకూ పనికిరాని బూట్లలా ఉంటాయి. పైగా లిమిటెడ్ ఎడిషన్ అని 100 జతలు మాత్రమే విడుదల చేశారట. 38 వేల నుంచి లక్ష వరకు ధరల్లో దొరికే వీటిపై సోషల్ మీడియాలో జోకులు తెగ పేలుతున్నాయి. ఒక్కసారి తలపై టోపీ నుంచి కాలి బూటు వరకు అన్నీ చిరిగినవే ధరించిన యూత్ రూపం ఊహించుకోండి. ..ఆ తర్వాత కొనాలో మానాలో మీ ఇష్టం. ‘ మేరా జూటా హై జపానీ … ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ ‘ అని రాజ్ కపూర్ ఎప్పుడో చెప్పాడంటారా! అలాగే కానివ్వండి

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్