అమెరికాలో టోర్నడోలు విధ్వంసం సృష్టించాయి. కొన్ని వందల కిలోమీటర్ల మేరకు పట్టణాలకు పట్టణాలే ఆగం అయ్యాయి. ఇళ్లు కూలిపోయాయి. వాహనాలు చెల్లాచెదురైపోయాయి. కనీసం 23 మంది ఈ టోర్నడోల శరాఘాతానికి దుర్మరణం చెందారు. అమెరికాలోని మిస్సిసిపీలో శుక్రవారం రాత్రి నుంచి టోర్నడోల బీభత్సం మొదలైంది. టోర్నడోల కారణంగా కొన్ని వందల కిలోమీటర్ల మేరకు మొత్తం విధ్వంసమే కనిపిస్తున్నదని స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది.
పశ్చిమ మిస్సిసిపీలోని సిల్వర్ సిటీ అనే పట్టణంలో నలుగురు ఈ టోర్నడోల కారణంగా కనిపించకుండా పోయారు. రెస్క్యూ టీమ్ వారి కోసం గాలిస్తున్నది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ పేర్కొంది. 1,700 మంది నివసించే రోలింగ్ ఫోర్క్ అనే పట్టణంలోనూ సెర్చ్, రెస్క్యూ టీమ్ పనిలో నిమగ్నమైంది. విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. తీవ్ర తుఫాను వల్ల అలబామా, టెన్నెస్సీ, మిస్సీస్సిప్పీ రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.