నేపాల్ లో ఈరోజు జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 72 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో నలుగురు విమాన సిబ్బంది, 68మంది ప్రయాణికులు… వీరిలో ఐదురుగు భారతీయులు కూడా ఉన్నారు. విమానంలో ఉన్న అందరూ మరణించినట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది.
నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి ఈ ఉదయం 10.47 గంటలకు ఎతి ఎయిర్ లైన్స్ కు చెందిన 9ఎన్-ఏఎన్సి విమానం పోఖారాకు బయల్దేరింది. 11.03 నిమిషాలకు విమానంలో సాంకేతిక సమస్య గుర్తించిన పైలట్ కంట్రోల్ రూమ్ ను, ఎటీసీని అప్రమత్తం చేశాడు. 11.25 నిమిషాలకు పోఖారా ఎయిర్ పోర్టులో టేకాఫ్ అవుతుండగా క్రాష్ అయ్యింది. ఇప్పటికి 40 మంది మృతదేహాలను వెలికి తీశారు.
ఈ ఘటన జరిగిన వెంటనే పోఖారా ఎయిర్ పోర్ట్ ను మూసివేశారు. ఈ ఘటనపై నేపాల్ ప్రభుత్వం తీవ్ర విచారాన్ని, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. రేపు జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తుకు ఐదుగురు ఉన్నతాధికారులతో ఓ విచారణ కమిటీని నియమించింది.
మొత్తం 72 మందిలో 53 మంది నేపాలీలు కాగా.. ఐదుగురు భారతీయులతో పాటు నలుగురు రష్యన్లు, ఇద్దరు కొరియన్లు, ఐరిష్, అర్జెంటీనా, ఫ్రాన్స్ దేశాలకు చెందిన ఒక్కో ప్రయాణికుడు ఉన్నారు.