Tuesday, September 17, 2024
HomeTrending NewsHeavy Rains: హిమాచల్...ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు

Heavy Rains: హిమాచల్…ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు

ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌ ను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. గత రెండు నెలలుగా ఆ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో పలు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇళ్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. సోలన్‌ జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా జాదోన్‌ గ్రామంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

భారీ వర్షాల కారణంగా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కొండ ప్రాంతంలోని అన్ని విద్యాసంస్థలకు ఈరోజు సెలవు ప్రకటించారు. మండి, సిమ్లా, బిలాస్‌పూర్‌ జిల్లాల్లోని 621 రోడ్లపై రాకపోకలను నిలిపివేశారు. అదేవిధంగా భారీ వర్షాల దృష్ట్యా పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శితో పాటు అన్ని డీసీలను ముఖ్యమంత్రి ఆదేశించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరోవైపు ఉత్తరాఖండ్‌ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల కారణంగా పలు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద ఉద్ధృతికి నది ఒడ్డున ఉన్న డెహ్రాడూన్‌ డిఫెన్స్‌ కళాశాల పేకమేడలా కూలిపోయింది. మాల్‌ దేవతా జిల్లాలో గల గఢ్వాల్‌ హిమాలయాల సమీపంలోని నది ఒడ్డున ఉన్న ఈ కళాశాల వరద ఉద్ధృతికి ఒక్కసారిగా కూలి నదిలో పడిపోయింది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఆ భవనంలో ఎవరూ లేకపోవడంతో పెను విషాదం తప్పింది. భవనం కూలిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

ఉత్తరాఖండ్‌లో రానున్న 24 గంటల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ మేరకు ఆరు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఇందులో డెహ్రాడూన్‌, నైనిటాల్‌ జిల్లాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో భారీ వర్షాలకు కొండ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 60 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 17 మంది అదృశ్యమైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జాతీయ రహదారులతోపాటు.. పలు రోడ్లను అధికారులు మూసివేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్