CM: గిరిజనులకు ఎప్పటికీ రుణపడి ఉంటా: జగన్

తమ ప్రభుత్వం గిరిజనులకు విద్య, సామాజిక, ఆర్ధిక రంగాల్లో అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయంగా  గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనన్ని పదవులు ఇచ్చి గౌరవించామని పేర్కొన్నారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో రూ.834 కోట్లతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి, ఇతర మౌలిక వసతుల కల్పనకు మెంటాడ మండలం చినమేడపల్లిలో  కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర  ప్రధాన్ తో కలిసి సిఎం జగన్  శంకుస్థాపన  చేశారు.  ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.  అనంతరం చినమేడపల్లి లో జరిగిన బహిరంగ సభలో సిఎం ప్రసంగించారు. ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి, శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ధర్మేంద్ర ప్రధాన్ కు సిఎం అభినందనలు తెలిపారు.

ఈ యూనివర్సిటీతో  రాబోయే రోజుల్లో మన గిరిజనులు ప్రపంచంతో పోటీ పడడారని, ఆ అడుగుకు ఇక్కడి నుంచే బీజం పడబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘గిరిజనులు స్వచ్చమైన మనసు కలిగిన వారు. కల్మషం లేని మనసులు కలిగిన వారు. తరతరాలుగా వారిని వెంటాడుతున్న పేదరికం.. ఇప్పటికీ మిగతా ప్రపంచంతో సమం కాని వారి జీవన ప్రమాణాలు… ప్రత్యేకించి వారి జీవితాలను మార్చే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఇప్పటికీ కూడా ఇంకా భావి ప్రపంచంతో అడుగులు వేసే క్రమంలో వెనకాలే ఉన్నారు” అంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.  గిరిజనులకు 50 నెలల తమ పాలనలో 36.12 లక్షల కుటుంబాలకు 11,548 కోట్లు డీబీటీ ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి అందించామని వివరించారు.

తనను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న గిరిజన జాతికి మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ బిడ్డగా మీ జగన్ ఎప్పటికీ రుణపడి ఉంటానని భావోద్వేగంతో వెల్లడించారు. దాదాపు 830 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వ విద్యాలయాన్ని మూడేళ్ళలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *