Friday, September 20, 2024
HomeTrending Newsకాంగ్రెస్ కు మిత్రపక్షాల షాక్

కాంగ్రెస్ కు మిత్రపక్షాల షాక్

జాతీయ స్థాయిలో బిజెపి రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల ప్రచారానికి ఉపక్రమిస్తుండగా… ఇండియా కూటమిలో సీట్ల పంపకాలు కొలిక్కి రాక విభేదాలు పొడసూపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి అగ్రనేతలు ఎవరు చొరవ చూపక జమ్ము కాశ్మీర్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఇండియా కూటమి బలహీనపడుతోంది. తృణముల్ కాంగ్రెస్ తో విభేదాల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో బిజెపి లబ్ది పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

జ‌మ్మూక‌శ్మీర్‌లో ఇండియా కూట‌మిలో విబేధాలు ఏర్ప‌డ్డాయి. సీట్ల స‌ర్దుబాటు విష‌యంలో నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నాయ‌కుడు ఒమ‌ర్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్ర‌టిక్ పార్టీ నాయ‌కురాలు మెహ‌బూబా ముఫ్తీ మ‌ధ్య స్వ‌ల్ప విబేధాలు ఏర్ప‌డ్డాయి. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో ఒమ‌ర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. కాంగ్రెస్ కావాల‌నుకుంటే జ‌మ్మూ సీట్ల‌ను పీడీపీకి ఆఫ‌ర్ చేయొచ్చ‌ని సూచించారు. గ‌తంలో గెలిచిన సీట్ల‌ను తాము త్యాగం చేయ‌లేం. మేం క‌ఠినం కాద‌న్నారు. కాంగ్రెస్ పార్టీతో సీట్ల స‌ర్దుబాటు విష‌యంలో చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయ‌ని, దీనిపై త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న చేస్తామ‌న్నారు.

క‌శ్మీర్ లోయలోని మూడు లోక్‌స‌భ స్థానాల్లో నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ పోటీ చేస్తుంద‌ని వారం రోజుల క్రిత‌మే ఆ పార్టీ ప్ర‌క‌టించింది. జ‌మ్మూక‌శ్మీర్‌లో మొత్తం ఐదు లోక్‌స‌భ స్థానాలు ఉన్నాయి. క‌శ్మీర్ వ్యాలీ మూడు స్థానాల్లో నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ గెల‌వ‌గా, జ‌మ్మూలోని రెండు స్థానాల్లో బీజేపీ గెలించింది. ల‌ఢ‌క్ ఎంపీ స్థానాన్ని కూడా బీజేపీనే కైవ‌సం చేసుకుంది.

పశ్చిమ బెంగాల్ లోని మొత్తం 42 ఎంపి స్థానాలకు తృణముల్ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి పైన కూడా అభ్యర్థిని ప్రకటించారు. అధీర్ రంజన్ నియోజకవర్గమైన బెర్హంపూర్ నుంచి క్రికెటర్ యూసుఫ్ పటాన్ పేరును ఖరారు చేశారు.

మరోవైపు మిత్ర పక్షాలతో చర్చలు జరుగుతున్నాయని… పొత్తులకు సమయం మించిపోలేదని, ఇంకా అవకాశం ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రీయ లోక్ దళ్ కూటమిని వదిలి బిజెపితో సాగుతోంది. బీహార్లో ముఖ్యమైన మిత్రపక్షం JD(U) ఇటీవలే ఇండియా కూటమిని వదిలి NDA గూటికి చేరింది. ఇక NDAను వదిలి బయటకు వచ్చే ప్రసక్తే లేదని ఆ పార్టీ నేత నితీష్ కుమార్ ఖరాఖండీగా ప్రకటించారు.

కూటమిలో లేకపోయినా గతంలో కాంగ్రెస్ తో ఉన్న టిడిపి ఇటీవల బిజెపితో జత కట్టింది. ఈ విధంగా ప్రతి రాష్ట్రంలో ఏదోవిధంగా కూటమిలో విభేదాలు ఉత్పన్నం అవుతున్నాయి. సమస్యలను పరిష్కరించే అంశంలో కాంగ్రెస్ నుంచి ఎవరు బాధ్యతగా ముందుకు రావటం లేదు. ఇండియా కూటమిలో ఉన్న ఒక పార్టీ దూరమైనా నైతికంగా కూటమి బలహీనపడినట్టుగా ప్రజలు భావించే అవకాశం ఉంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్