Monkeys problem for alternate Crops:
తెలంగాణాలో పొలాలు తెగ అయోమయంలో పడ్డాయి. రైతుకు, పండే నేలకు ఇష్టమయిన పంటలు కాకుండా…ఇంకేవో పంటలు వేయాల్సిన రోజులు వచ్చాయి.
వడ్ల గింజలో దాగిన బియ్యం గింజ రహస్యాన్ని ఛేదించడానికి ఇప్పుడు మానవాతీత శక్తులేవో కావాలి. ఉప్పుడు బియ్యం చప్పుడు చేయకూడదట. యాసంగి వడ్లు వేసారి రోడ్లమీదే మిగిలిపోవాలట.

అత్యున్నత చట్టసభల్లో ఉడకని పప్పులు…ఉడకని బియ్యంతో కలిసి అట్టుడికిపోతున్నాయి. వడ్ల భాషలో పొట్టు మిగిలి గింజ అదృశ్యమయ్యింది. మిగిలిన పొట్టు కోసం పార్టీలు కొట్టుకుంటున్నాయి. ఎందుకూ కొరగాని వరి పొట్టు మీద ఎవరికీ పట్టు దొరకడం లేదు.

వడ్లు కొనేదెవరు? కొనిపించేదెవరు?
వరి వేయమన్నదెవరు?
వద్దన్నదెవరు?
హామీ ఇచ్చిందెవరు?
హామీని తుంగలో తొక్కిందెవరు?
అంతా మిథ్య.

ప్రతి గింజనూ కొంటామంటూ పార్లమెంటులో పలికే పలుకులకు విలువ ఎందుకు లేదు? ప్రేమ లేఖలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, అలకలు, నిరసనలు, గాయి గత్తరలు…అంతా ఉత్తర కుమార ఉత్తుత్తి సంప్రదింపులేనా? అన్నం రైతుకు సున్నమేనా?
పొలం నోట్లో బియ్యమేనా?

పిడుగుకు బియ్యానికి ఒకే మంత్రమేనా?

నిలువెత్తున నిలిచిన స్తంభాల సాక్షిగా తెలంగాణా వడ్ల గురించి పార్లమెంటు ఏమి చెప్పిందో విడమరిచి అర్థమయ్యేలా చెప్పగల భాషా పండితులు ఉన్నారా? అర్థం కాకుండా చెప్పి అయోమయంలో గెలిచినట్లు అనిపించుకోవాలనే మాటల మాయ చేసినట్లు ప్రాణాలను నిలబెట్టే ప్రాణమున్న వడ్లకు తెలియదా? వడ్లకు నోరు లేకపోవచ్చు. కానీ…జీవముంది. బలముంది. మనుషుల నోరు పెగలడానికి కావాల్సిన శక్తినిచ్చే పోషక విలువలున్నాయి. వ్యవస్థలు విలువలను కోల్పోవచ్చు కానీ…వడ్లు విలువను కోల్పోవు.

సుబ్బి పెళ్లి ఎప్పుడయినా ఎంకి చావుకే వస్తుంది. తెలంగాణాలో వరి మెడకు చుట్టుకున్న ఉరి కోతుల మెడకు కూడా చుట్టుకుంది. వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలంటే…ఆ పంటలకు కోతుల బెడద లేకుండా చూడ్డం ఎలాగో తెలియక వ్యవసాయ శాఖ తలపట్టుకుంటోంది.

త్రేతాయుగంలో ఒక కోతి దాడి చేశాక అంతటి రావణాసురుడు ముచ్చటపడి కట్టించుకున్న అశోక వనం, పెంచుకున్న చెట్లు ఏవీ మిగల్లేదు. ఆకాశాన్ని తాకుతూ ఊగుతున్న అశోక వృక్షాలు శోకిస్తూ నేల కూలాయి. సీతమ్మను కనుక్కుని తిరిగివస్తూ కోతి మూక సుగ్రీవుడి బంధువు తోటలో ఆనందంగా పార్టీ చేసుకుంటే ఆ మధువనమంతా చెల్లా చెదరైపోయింది.

కోతి చేష్ఠలకు కోతికి పేటెంట్ ఉంటుంది. దాని సహజసిద్ధ స్వభావాన్ని కాదనే హక్కు మనకు ఉండదు. కోతికి కొబ్బరికాయ దొరికినట్లు…తెలంగాణాలో పంట పొలాల మీద కోతుల మూక దాడి చేస్తే దిగుబడి కృష్ణార్పణం. దాంతో పల్లెల్లో తిరుగుతున్న వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ పంటలను సూచించడం కంటే…
మీ ఊళ్లో ఎన్ని కోతులున్నాయి?
ఎన్ని కోతి మూకలున్నాయి?
ఎలాంటి కోతులు?
చివరిసారి కోతులను ఎప్పుడు చూశారు?
వచ్చిన కోతులు ఏ పంటల మీద పడి ఎలా దాడి చేశాయి?
కొండముచ్చులు కూడా వస్తున్నాయా?
కోతులను చూసి ఊర కుక్కలు అరుస్తున్నాయా?
లేక ఊర కుక్కలనే కోతులు బెదిరిస్తున్నాయా?
లాంటి సమగ్రమైన కోతుల వివరాలను సేకరిస్తున్నారు.

చీమా! చీమా! ఎందుకు కుట్టావు?
అంటే అనేక గొలుసుకట్టు చర్యల కథ చెప్పినట్లు…
కోతీ! కోతీ! వెళ్లిపో! అనడానికి కూడా అనేక గొలుసు కట్టు చర్యల వడ్ల కథ చెప్పాలి.

వరికి ఉరి కాలం.
కోతులకు వర్రీ కాలం.
రైతులకు పాడు కాలం.

-పమిడికాల్వ మధుసూదన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *