Tuesday, April 15, 2025
HomeTrending Newsఈటెల రాజీనామా ఆమోదం

ఈటెల రాజీనామా ఆమోదం

శాసన సభ్యత్వానికి ఈటెల రాజేందర్ చేసిన రాజీనామాను తెలంగాణా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఆమోదించారు. రాజీనామా చేసిన రెండు గంటల్లోపే ఆమోదించడం గమనార్హం. ఈటెల స్పీకర్ ను కలిసి స్వయంగా రాజీనామా సమర్పించాలని అనుకున్నారు, కానీ పోచారం అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శికి లేఖ ఇచ్చి వెళ్ళిపోయారు.

ఆ తర్వాత గంటన్నరకే ఈటెల రాజీనామా ఆమోదం పొందినట్లు స్పీకర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ సాయంత్రానికి హుజురాబాద్ నియోజకవర్గం స్థానం ఖాళీ అయినట్లు గెజిట్ ప్రకటించి దాన్ని వెంటనే ఎన్నికల సంఘానికి పంపుతారు. ఆరు నెలల్లోగా అంటే డిసెంబర్ లోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది

మరోవైపు ఎల్లుండి ఢిల్లీ లో ఈటెల రాజేందర్ బిజెపిలో చేరనున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో ఈటెల ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అనంతరం వచ్చే నెలలో హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేసేందుకు ఈటెల సిద్ధమవుతున్నారు.

టి ఆర్ ఎస్ నుంచి మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, ఎంపి కెప్టెన్ లక్ష్మీకాంత రావు, మాజీ ఎంపి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గంపై ప్రత్యేక దృషి సారించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్