Saturday, January 18, 2025
Homeతెలంగాణఇక ఏపితో అమీ తుమీ!

ఇక ఏపితో అమీ తుమీ!

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ (ఆర్డీఎస్) కుడి కాల్వ నిర్మాణాలను తెలంగాణ క్యాబినెట్  తీవ్రంగా నిరసించింది. ఆంద్రప్రదేశ్ నిర్మిస్తున్న ప్రాజెక్టులు అక్రమమని వీటికి వ్యతిరేకంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించిందని, సుప్రీం కోర్టులో కేసులు వేసిందనీ నీటిపారుదల శాఖ  కేబినెట్ కు తెలిపింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తో పాటు కేంద్రం కూడా ఆదేశించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ  ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని కేబినెట్ తీవ్రంగా ఖంఢించింది.

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పడి 17 సంవత్సరాలయినా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలైనా..తెలంగాణకు కృష్ణా జలాల్లో న్యాయమైన నీటివాటా నిర్దారణ కాలేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం- 1956 సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయమని విజ్జప్తి చేసింది. అయితే  సుప్రీం కోర్టులో కేసు కారణంగా తాము సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయలేకపోతున్నామని,  తెలంగాణ కేసులను విరమిస్తే గనుక తాము త్వరగా నిర్ణయిస్తామని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి అపెక్స్ కౌన్సిల్ రెండవ సమావేశం (6 అక్టోబర్ 2020 నాడు) లో  స్పష్టమైన హామీ ఇచ్చారు. కేంద్రమంత్రి హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసును విరమించుకుని కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరిస్తదనే నమ్మకంతోనే తెలంగాణ ప్రభుత్వం కేసును ఉపసంహరించుకున్న నేపథ్యంలో కేంద్రం యొక్క నిష్క్రియా పరత్వం వల్ల  తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడింది.

కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆ రాష్ట్రం కుదురుకోవడానికి కేంద్రం కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టి నూతన రాష్ట్రానికి సహకారం అందించాల్సి వుంటుందని, అటువంటి చొరవ తీసుకోకుండా, బాధ్యత వహించకుండా నదీ జలాల విషయంలో అవలంబిస్తున్న, కేంద్ర నిర్లక్ష్య వైఖరి పట్ల కేబినెట్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో .. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా పోవాలని కేబినెట్ అభిప్రాయ పడింది.

ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన అక్రమ ప్రాజెక్టుల వలన.. పాలమూరు, నలగొండ,ఖమ్మం,వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు.. హైద్రాబాద్ కు తాగునీరు విషయంలో తీవ్ర అన్యాయం జరగనున్ననేపథ్యంలో.,  న్యాయంగా దక్కాల్సిన కృష్ణా నీటి వాటాను దక్కించుకోవడానికి వీలుగా మరికొన్ని కొత్త ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణం, ప్రస్తుతం ఉన్న ఎత్తిపోతల పథకాల సామర్ధ్యం పెంపుతో పాటు అదనంగా కాల్వలు నిర్మించాలని క్యాబినెట్ తీర్మానించింది.

కృష్ణా జలాలపై  తెలంగాణ హక్కులను పరిరక్షించుకొని రాష్ట్ర రైతాంగాన్ని, వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి కార్యాచరణ నిర్ణయించింది. ఈ విషయంలో ప్రధాన మంత్రిని, కేంద్ర జల శక్తి మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించి, ఈ అక్రమ ప్రాజెక్టులను నిర్మాణం నిలిపేసేలా చూడాలని.. ప్రజా క్షేత్రంలో, న్యాయస్థానాల్లో,  ఆంద్ర ప్రదేశ్ జల దోపిడీని ఎత్తిచూపి,  రాబోయే వర్షకాల పార్లమెంటు సమావేశాల్లో గళం విప్పి,  జాతికి వివరించాలని అభిప్రాయం వ్యక్తమైంది. ఆంధ్ర ప్రదేశ్ అక్రమ ప్రాజెక్టుల పర్యవసానంగా కృష్ణా బేసిన్ ప్రాంతాలకు సాగునీటి రంగంలో జరిగబోయే తీవ్ర నష్టాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజల్లోకి తీసుకుపోవాలని నిర్ణయించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్