Holy Dip in Ganges will go off Sins :
“జంతూనాం నర జన్మ దుర్లభం..” అని పరమపూజ్య ఆది శంకరుల వారు ప్రవచించారు. ఇంతటి అసాధ్యమైన నర జన్మ పొంది కూడా మనుషులు పరమాత్మను చేరుకునే దిశగా కాక, తద్విరుద్ధంగా నడచుకుంటున్నారు. కలియుగ ధర్మాన్ని అనుసరించి లెక్కకు మిక్కిలిగా పాప కార్యాలు చేస్తూ, బ్రహ్మానికి దూరమవుతున్నారు. కలియుగ మానవులు చేసేటి పాపాలను, మన పూర్వీకులు దశవిధాలుగా వర్ణించారు. వాటిని మూడు వర్గాలుగానూ వర్గీకరించారు.
దశ పాపాలు అంటే..
(1) అసత్యోక్తి – అసత్యం పలకడం,
(2) దోషారోపణోక్తి – పరులపై నిందలు వేయడం,
(3) కఠినోక్తి – ఇతరులు గాయపడేలా మాట్లాడడం,
(4) నిష్ఫలోక్తి – నిష్ప్రయోజనంగా వాగడం,
(5) చౌర్యకరణం – దొంగతనం,
(6) దుష్కార్య కరణం – ఇతరులను బాధించే పనులు
(7) జీవహింస – జంతు, జీవజాలాన్ని హింసించడం
(8) దుష్కార్యాపేక్ష – చెడు కార్యాలు చేయాలన్న కోరిక,
(9) పర దారాపేక్ష – ఇతరుల భార్యలను కోరుకోవడం
(10) పర ద్రవ్యాపేక్ష – ఇతరుల ధనంపై ఆశ.
పై పదింటినీ దశ పాపాలు అంటారు.
మొదటి నాలుగు పాపాలనూ నోటితో చేస్తాం.
తర్వాతి మూడు పాపాలనూ శరీరంతో చేస్తాం.
మిగిలిన మూడింటినీ మనసుతో చేస్తాం.
తెలిసీ తెలియక చేసిన ఈ పాపాలకు, యాతన శరీరంతో, దుర్భరమైన శిక్షలు అనుభవించాల్సి వుంటుందంటుంది గరుడ పురాణం.
Holy Dip in Ganges will go off Sins :
పాపాలకు పరిహారం లేదా..?
జ్ఞానంతోనో అజ్ఞానంతోనో.. కలియుగంలో మానవులు చేసేటి పాపాలకు, దయామయులైన మన ప్రాచీనులు తగిన పరిహారాలనూ సూచించారు. వాటిలో ప్రసిద్ధమైనది దశపాప హర వ్రతం. ఏమిటీ వ్రతం..? పంచభూతాత్మకమైన శరీరానికి పట్టిన మకిలిని శుద్ధి చేసుకున్న రీతిలోనే, మనసునీ పవిత్ర గంగతో శుద్ధి చేసుకోవడమే దశపాప హర వ్రతం. జ్యేష్టమాసం, శుక్లపక్ష దశమినాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి.
ఈరోజున గంగానదిలో స్నానం చేయడం వల్ల సర్వపాపాలు హరించుకుపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కుదరని వాళ్లు, “ముచ్యతే సర్వపాపేభ్యో గంగా ఇత్యక్షర ద్వయం” అంటే, గంగ అన్న స్మరణే సర్వపాపాలనూ హరిస్తుందన్న శాస్త్ర వాక్యాన్ని అనుసరించి, సమీపంలోని నదుల్లో.. గంగను స్మరించి స్నానం ఆచరించినా దశవిధ పాపాలూ తొలగిపోతాయి.
గంగా.. ప్రధానాంశ రూపిణీం….
స్త్రీలందరూ దేవీస్వరూపాలే అయినా, పరిపూర్ణ స్వరూపాలు మాత్రం అయిదే అంటుంది పురాణం. అందులోనూ ప్రధానాంశ రూపిణులు కొందరున్నారని, వారిలో గంగ కీలకమని చెబుతుంది.
“గోలోకస్థాన ప్రస్థాన సుఖసోపాన రూపిణీ
పవిత్ర రూపా తీర్థానాం సరితాం చ పరావరా
శంభుమౌళి జటామేరు ముక్తాపంక్తి స్వరూపిణీ
తపస్సంపాదినీ సద్యో భారతేషు తపస్వినామ్”
అంటే, పాపాత్ముల పాపాలు అనే ఎండుకట్టెలను కాల్చే అగ్నిలాంటిది. సుఖస్పర్శ, స్నానపానాలతో నిర్వాణ పదవిని అందించే శక్తి గలది., గోలోకాన్ని చేరుకునేందుకు సుఖ సోపాన స్వరూపిణి, సర్వనదీ నద తీర్థాలలోకి పరమపావని, శివుడి జటాభారానికి కొసను వేలాడేట్టు అలంకరించిన ముత్యాలదండ. తపస్సులను శీఘ్రంగా సిద్ధింపచేసే పవిత్రురాలు అని అర్థం.
అంతటి గంగానదిలో స్నానం చేయడం వల్ల, సర్వపాపాలూ హరించుకుపోతాయన్నది భక్తుల అచంచల విశ్వాసం. దశమినాడు, కలశపు నీటిలో గంగాదేవిని ఆవాహనం చేసి, షోడోశోపచార రీతుల్లో పూజించి, నదీస్నానం చేసి, దానధర్మాలు చేసినట్లయితే, సర్వపాపాలూ హరించుకుపోతాయి.
(శుభం భూయాత్)
పి.విజయకుమార్
astrovijay@gmail.com
Must Read : శ్రీవారి భక్తులకు ఊరట

జర్నలిజంలో 30 సంవత్సరాలకు పైబడిన అనుభవం.. 15 సంవత్సరాలకు పైగా జోతిష శాస్త్రంలో అధ్యయనం.