Saturday, April 20, 2024

వరుణ- కరుణ

Cloud Burst:”ఓ వరుణ దేవుడా!
నీకు దండాలు. నీళ్లకు నీవే దిక్కు. మొసలి వాహనుడా!
చేతిలో పాశం పట్టుకుని, ఒళ్లంతా తెలుపు, నీలం, నలుపు మేఘాలను వస్త్రాలుగా ధరించిన దేవుడా!
మెరుపు తీగలు అలంకారంగా కలిగినవాడా!
ఉరుముల శబ్దాలతో బయలుదేరేవాడా!
భూమి మీద ఉన్న నదీ నదాలు చెరువులు కుంటలు జలాశయాలు…అన్నిటినీ నీ నీటితో నింపు.
గాలికి తేలిపోయే మేఘాలనన్నిటిని ఒడిసిపట్టుకో.
నీ కడుపులో దాచుకున్న నీటిని వర్షించు.
ఆవిరిగా ఆ నీటిని నువ్వే మళ్లీ మళ్లీ తాగు.
తాగిన నీటిని మళ్లీ మళ్లీ వర్షించు.
నువ్వు, నీ అధిపతి ఇంద్రుడు చల్లగా ఉందురుగాక!”

వరుణదేవుడి స్తోత్రానికి దాదాపుగా అర్థం ఇది. మేఘం- నీరు- ఆవిరి- మేఘం స్వరూప స్వభావాలు- మేఘాలు ఏర్పడే ప్రక్రియ- అన్నిటినీ ఈ వరుణ మంత్రం ఒక వీడియోలా చూపుతోంది.

ప్రజా ప్రభుత్వాల్లో అనేక శాఖలు, వాటి నియామకాలకు అనేక దశలు, ఆ ఉద్యోగాల స్వరూప, స్వభావాలకు తగినట్లు జీతభత్యాలు ఉంటాయి. జిల్లాల్లో కలెక్టర్లు, ఆ పైన కార్యదర్శులు, వీరందరినీ చూడ్డానికి ప్రధాన కార్యదర్శి ఉంటారు.

సకల భువన భాండాలను పరిపాలించడానికి కూడా విశ్వాత్మకుడికి ఇలాంటి నిర్వహణా విధానమే ఉంది. పరమాత్మ కూడా ఒక్కొక్క కార్యదర్శికి ఒక్కొక్క పని అప్పగించాడు. యు పి ఎస్ సి ప్రిలిమ్స్, మెయిన్స్, మౌఖిక ఇంటర్వ్యూల కంటే అష్టదిక్పాలకులకు విష్ణువు పెట్టిన పరీక్షలు కఠినతరమయినవి. స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ లా అగ్నిదేవుడు రోజూ దేవతలకు అన్నం పొట్లాలు మోసుకెళ్లి ఇవ్వాలి. ఒకే సూర్యుడిలో ఒకే కాలంలో వెయ్యి కిరణాలు విస్ఫోటనం కావాలి. ఒక ప్రాంతానికి వేడిని ఇవ్వాలి. అదే సమయంలో మరొక ప్రాంతానికి వేడిని పరిహరించి వెలుగును మాత్రమే ఇవ్వాలి. ఇంతకంటే లోతుగా వెళ్లడానికి ఇది వేద శాస్త్ర పాఠం కాదు.

Cloud Burst

ఇంద్రుడు దేవుడే అయినా ప్రధాన కార్యదర్శిలాంటి వాడు. ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి ప్రభువు. ఇంద్రుడికి విష్ణువు ప్రభువు. భాగవతంలో ఇంద్రుడికెందుకు హవిస్సులు? మనకు అన్నీ ఇచ్చే కొండకే ఇద్దాం…అని కృష్ణుడు అన్నప్పుడే ఇంద్రుడు హర్ట్ అయి ఒక వారం రోజులు రాత్రి పగలు ఎడతెరిపి లేని వర్షాలు కురిపించాడు. చిటికెనవేలు గోటిమీద అలవోకగా పూలగుత్తిని నిలిపి ఆడుకున్నట్లు కృష్ణుడు గోవర్ధన గిరి పర్వతాన్ని గొడుగుగా పట్టుకుని…ఇంద్రుడికి బుద్ధి చెప్పాడు. తప్పు తెలుసుకుని ఇంద్రుడు కృష్ణుడికి పాలతో గోవింద పట్టాభిషేకం చేశాడు. ఆ క్షణం నుండే కృష్ణుడు గోవిందుడు, గిరిధారి అయ్యాడు. అప్పుడు ఇంద్రుడు ఎన్ని రకాల మేఘాలను కృష్ణుడి మీదికి వదిలాడో లెక్కే లేదు. ఈ ఘట్టాన్ని మన పోతన పరవశించి ప్రత్యక్షరాన్ని మంత్రమయం చేశాడు.

వర్షాలు పడకపోతే వరుణజపం, వరుణ హోమం చేస్తారు. విరాటపర్వం చదువుతారు. కప్పలకు పెళ్లిళ్లు చేసి ఊరేగిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం అనాదిగా ఉంది.

తాజాగా తెలంగాణాలో వర్షాలు, వరదలు, ముంపులు ఎక్కువ కావడంతో వర్షాలు ఆగిపోవడానికి పూజలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాలు పడడానికి మంత్రం ఉన్నప్పుడు…ఆగిపోవడానికి కూడా మంత్రం ఉండే ఉంటుంది!

ద్వాపరలో అంటే కొండ గొడుగుగా పట్టుకుని ఏడు రాత్రుళ్లు, ఏడు పగళ్లు అంగుళం కదలకుండా, చేతి వేలయినా మార్చుకోకుండా ఏడేళ్ల కృష్ణుడు అందరినీ ముంపు నుండి రక్షించాడు.

ఇది కలియుగం. ఇంద్రుడికి చెప్పకుండానే తామరపువ్వు తగిలి క్లౌడ్ బరస్ట్ అయినట్లు అనుమానిస్తున్న మేఘాలనుండి మనల్ను రక్షించడానికి ఎవరున్నారు? ఉన్నా…వారు భద్రగిరిని వేలి మీద ఎత్తి పట్టి ఏడు నిముషాలు లేదా ఏడు సెకన్లు నిలుచోగాలరా? నిలుచున్నా…మనం ధైర్యంగా దాని కిందికి వెళ్లగలమా?

నిజమే.
చినుకు పడడానికయినా…ఆకాశానికి చిల్లులు పడినట్లు పడే చినుకులు ఆగడానికయినా వరుణుడి కరుణే కావాలి.

అంతటి ఇంద్రుడే అపోహలు, అసూయలతో సాక్షాత్తు పరమాత్ముడి మీదికే మేఘాలను ఉసిగొలిపాడు. ఇప్పుడు తెలంగాణ మీదికి ఏ ఇంద్రుడు కాలమేఘ, పర్జన్య, జీమూత, పుష్కలావర్త మేఘాలను ఉసిగొలిపాడో?
ఏ పోతన రాయాలి ఈ క్లౌడ్ బరస్ట్ భాగోతాన్ని?

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

నదీ పుత్రుడు

RELATED ARTICLES

Most Popular

న్యూస్