ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలోనే జలదోపిడీ ఎక్కువగా జరుగుతోందని, దీనికి సిఎం కేసిఆర్, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వాలే బాధ్యత వహించాలని పిసిసి మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపి ఉత్తమ కుమార్ రెడ్డి అన్నారు. ఈ అంశాన్ని రాబోయే పార్లమెంట్ సమావేశాలలో లేవనెత్తుతానని చెప్పారు. పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతుంటే చూస్తూ కూర్చున్న కేసిఆర్ కు ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే అర్హత ఉందా అని ప్రశ్నించారు.
సంగమేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే కూడా ఆపలేకపోయారని, సంగమేశ్వరం లిఫ్ట్ తో ఏపి రోజుకు మూడు టిఎంసిల నీరు తరలించేందుకు ప్రణాళికలు వేస్తున్నారని, దీనితో సాగర్ కింద ఉన్న లక్షల ఎకరాల ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని, దీనిలో ప్రభుత్వ పెద్దలకు 8 శాతం కమీషన్లు అందాయని అయన ఆరోపించారు. ఎన్నో త్యాగాలతో తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, నిరుద్యోగ సమస్య ఎక్కువైందని ఉత్తమ్ అన్నారు.
రేపు జరిగే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తాను పాల్గొంటానని ఉత్తమ్ వెల్లడించారు. కొత్తగా ఎన్నికైన పిసిసి నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. పదవి ఉన్నా లేకున్నా, పార్టీ కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. ఇన్నిరోజులు తనకు సహకరించిన పార్టీ కార్యకర్తలకు ఉత్తమ్ కృతజ్ఞతలు తెలియజేశారు.