Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ అధికమవుతూ ప్రజలు కలవరపడుతోంటే కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బిజెపి నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్‌ ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయకపోగా… మొదటి డోసు వ్యాక్సినేషన్ 100 శాతం వేశామని, రెండవ డోసు 80 శాతం వేశామని అబద్దాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్ లో మీడియాతో విజయశాంతి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు అమలు చేయకుండ మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టి మరీ సొమ్ము చేసుకుంటున్న కేసీఆర్ సర్కార్ కరోనా నిబంధనలు గాలికొదిలేసిందని ఆరోపించారు.

రోజురోజుకి రాష్ట్రంలో సామాన్య ప్రజలతో పాటు, వారికి వైద్యం చేస్తున్న డాక్టర్లు, సిబ్బంది సైతం కరోనా బారిన పడగా… ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయినట్టు మీడియా కథనాల ద్వారా తెలుస్తోందని విజయశాంతి అన్నారు. ఇటీవల కరోనాపై దేశ ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి సూచనలు చేస్తే… ఆ కాన్ఫరెన్సులో సైతం పాల్గొనలేనంత ముఖ్యమైన పని సీఎం కేసీఆర్‌కి ఏముందో రాష్ట్ర ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రోజూ లక్షకు పైగా కరోనా టెస్టులు చేయాలని హైకోర్టు ఇటీవల మొట్టి కాయలు వేస్తే… తాజాగా మళ్ళీ జ్వర సర్వే పేరుతో పట్టణ, గ్రామీణ కార్యకర్తలను పరుగులు పెట్టిస్తున్నారని, కనీసం వారికి రక్షణగా అందుబాటులో ఉంచాల్సిన మాస్కులు, శానిటైజర్లు లేకపోవడంతో సొంత డబ్బులతో కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో 10 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని రెండేండ్ల కిందట అసెంబ్లీలో స్వయంగా వెల్లడించిన సీఎం కేసీఆర్… వాటి భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకోకుండా జాప్యం చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులలో పేదవారికి అందాల్సిన మెరుగైన వైద్యాన్ని దూరం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పడితే కాంట్రాక్ట్, ఔట్‌‌ సోర్సింగ్ వ్యవస్థ ఉండదని ప్రగల్బాలు పలికిన సీఎం కేసీఆర్‌‌‌‌… చివరకు మెడికల్ ప్రొఫెసర్ల భర్తీని కూడా కాంట్రాక్ట్ మయం చేసి, టెంపరరీ నియామకాలకే మొగ్గు చూపడం చూస్తుంటే… ఎంత దిగజారిపోయారో స్పష్టంగా అర్దమవుతోందన్నారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలంటే లెక్కలేని ఈ నిర్లక్ష్యపు ముఖ్యమంత్రిని రానున్న ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజానీకం గద్దె దించడం ఖాయమని విజయశాంతి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com