Sunday, January 19, 2025
HomeTrending Newsరాష్ట్రానికి రండి: కేటియార్ పిలుపు

రాష్ట్రానికి రండి: కేటియార్ పిలుపు

Ts Minister Ktr Key Note Address At French Senate In Paris :

గత ఏడేళ్లుగా తెలంగాణ రాష్ట్రం  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధి దిశలో పురోగమిస్తోందని, పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా ఉందని రాష్ట్ర మంత్రి కేటిఆర్ అన్నారు.  రాష్ట్రం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాన్ని వివరిస్తూ పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. ప్యారిస్‌లోని ఫ్రెంచ్ సెనేట్ వేదికగా జరిగిన ‘యాంబిషన్ ఇండియా 2021’ బిజినెస్ ఫోరమ్‌లో తెలంగాణ ప్రగతిశీల విధానాలను కేటిఆర్ ఎలుగెత్తి చాటారు. కేటీఆర్ కీలకోపన్యాసానికి స్థానిక వాణిజ్య, రాజకీయ ప్రముఖుల నుండి విశేష స్పందన వచ్చింది.

‘కోవిడ్ అనంతర కాలంలో ఇండో-ఫ్రెంచ్ సంబంధాల భవిష్యత్తును రూపొందించడం’ అనే అంశంపై కేటీఆర్ ప్రసంగించారు. “జాతీయ విధానాలు కేంద్ర ప్రభుత్వ పరిధి అయితే, భారత సమాఖ్య నిర్మాణంలో, రాష్ట్రాలు కూడా భూమి కేటాయింపు, ఆమోదం, అనుమతులు, శిక్షణ పొందిన మానవ వనరులను తయారు చేయడం, వనరుల సేకరణ విధానాలు లాంటి అంశాల్లో గణనీయమైన స్వయంప్రతిపత్తిని పెంపొందించుకుంటున్నాయని కేటీఆర్ వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వ పెట్టుబడిదారుల అనుకూల విధానాలు, రాష్ట్రంలో నెలకొన్న పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను కేటీఆర్ ప్రస్తావించారు.  తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అన్వేషించాలని ఫ్రెంచ్ పెట్టుబడిదారులను ఆయన ఆహ్వానించారు.  ఫోరమ్‌లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఫ్రెంచ్ కంపెనీలకు, ముఖ్యంగా ఎస్‌ఎంఈలకు ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్‌ను అభివృద్ధి చేయడానికి సుముఖంగా ఉందన్నారు.

టీఎస్ ఐపాస్ పాలసీ పారదర్శకతతో కూడిన స్వీయ-ధృవీకరణను అనుమతిస్తుందని మరియు చట్టం ప్రకారం 15 రోజులలో అన్ని రకాల అనుమతులకు సంబంధించి పూర్తి క్లియరెన్స్ లభిస్తుందన్నారు.  ఈ 15 రోజుల వ్యవధిలో అనుమతుల జారీ జరగకపోతే 16వ రోజున, పూర్తి అనుమతులు లభించి ఆమోదించబడినట్లు భావించబడుతుందని కేటిఆర్ వివరించారు.

తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) గురించి కూడా కేటీఆర్ సదస్సులో ప్రస్తావించారు. యువతకు  ప్రభుత్వం తన సొంత ఖర్చులతో  శిక్షణ ఇచ్చి, వారిని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మానవవనరులుగా తీర్చిదిద్దుతోందని, దీనితో స్థానిక ప్రజలకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నయని చెప్పారు. ఏ కంపెనీ అయినా భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే, ఇతర రాష్ట్రాలు ఆఫర్ చేస్తున్న అంశాలను ప్రస్తావించగలిగితే,  మేము వారి ఆకాంక్షలకు తగ్గట్టుగా ఆఫర్‌ను అందుకుంటామని లేదా వారి ఆఫర్‌ను బీట్ చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సుకు తెలంగాణను భాగస్వామ్య రాష్ట్రంగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి కేటీఆర్

Must Read :పాతబస్తీ అభివృద్ధిపైన కేటీఆర్ సమీక్ష

RELATED ARTICLES

Most Popular

న్యూస్