Friday, March 29, 2024
HomeTrending Newsవిద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్: రేవంత్ రెడ్డి

విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్: రేవంత్ రెడ్డి

దళిత, గిరిజన దండోరా స్పూర్తితో రాష్ట్రంలో ‘విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్’ కార్యక్రమం చేపడుతున్నట్లు పిసిసి అధ్యక్షుడు ఏ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిరుద్యోగ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గాంధీ జయంతి అక్టోబర్ 2 నుంచి సోనియాగాంధీ జన్మదినం, తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన డిసెంబర్ 9 వరకూ ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు.

మలిదశ ఉద్యమంతో భౌగోళిక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అమరుల త్యాగాలకు విలువ లేకుండా టీఆరెస్ పాలన సాగుతోందని, కేసీఆర్ పథకాలు ‘పైన పటారం- లోన లోటారం’ అన్నట్లు ఉన్నాయని విమర్శించారు. నాలుగు కోట్ల ప్రజల ఆరాధ్య దైవం తెలంగాణా తల్లి కెసియార్ ఫాం హౌస్ లో బందీగా మారిందని, ఆ తల్లిని బంధ విముక్తం చేయడానికి ఆఖరి పోరాటానికి సిద్ధమయ్యామని వెల్లడించారు. తెలంగాణా విద్యార్థి, నిరుద్యోగ, యువత, అమరవీరులను సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమం చేపడతామన్నారు. ఉద్యోగ క్యాలెండర్ నియామకంపై పోరాటం చేస్తామని, రాజకీయాలకు అతీతంగా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.

అక్టోబర్ 2న దిలీషుఖ్ నగర్ చౌరస్తాలోని రాజీవ్ గాంధీ విగ్రహంనుంచి మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసుకున్న ఎల్బీనగర్ చౌరాస్తా వరకూ పాదయాత్రగా వెళతామని చెప్పారు. డిసెంబర్ 9న ముగింపురోజున భారీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ఆకలి కేకలు ఆగాలంటే సోనియమ్మ రాజ్యం రావాలని, ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఇప్పుడు తెలంగాణ అత్యధికంగా ప్రమాదంలో ఉందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

పేదలకు ఉచిత విద్య అందించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలోనే ఫీజు రియంబర్స్ మెంట్ పథకం తెచ్చిందని, ఇప్పుడు రీయంబర్స్ మెంట్ బకాయిలవల్ల వేలమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసియార్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 4 వేల 630 ప్రాథమిక పాఠశాలలను మూసివేశారని ఆరోపించారు. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు 4 వేల కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని  డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది పట్టబద్రులైన నిరుద్యోగులు ఉన్నారని, వారికి నిరుద్యోగ భృతి ఇస్తారా? ఇవ్వరా అనేది స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక్కో నిరుద్యోగికి కేసీఆర్ లక్ష రూపాయలు బాకీ ఉన్నారని పేర్కొన్నారు.

హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రెండ్రోజుల్లో ఖరారుచేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అభ్యర్థిపై సీఎల్పీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైందని, ఉపఎన్నికలో తమ వ్యూహం తమకుందని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్