Friday, November 22, 2024
HomeTrending Newsటిఆర్ఎస్ లోకి రమణ!

టిఆర్ఎస్ లోకి రమణ!

తెలుగుదేశం తెలంగాణా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీలో చేరనున్నారు. రమణతో  టిఆర్ఎస్ నేతలు ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రమణ గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపిగా పనిచేశారు. తెలంగాణా ఏర్పాటు తరువాత తెలుగుదేశం రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రమణ కొనసాగుతున్నారు. రమణతో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చర్చలు జరిపారు.

2014 ఎన్నికల్లో తెలుగుదేశం 15 సీట్లు గెలిచినప్పటికీ 2018 నాటికి కేవలం ఇద్దరు మాత్రమే (సండ్ర వెంకట వీరయ్య, ఆర్. క్రిష్ణయ్య) మిగిలారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరగా, మిగిలిన 12 మంది టిఆర్ఎస్ లో చేరిపోయారు. ఆ తర్వాత 2018 లో కేవలం రెండు సీట్లకే తెలుగుదేశం పరిమితమైంది. ఈ రెండు సీట్లు ఖమ్మం జిల్లానుంచే గెలుపొందింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు టిఆర్ఎస్ లో చేరారు. వీరిలో సండ్ర కూడా ఉన్నారు.

ఒకప్పుడు తెలంగాణా లో బలమైన కేడర్ కలిగిన తెలుగుదేశం ఇప్పుడు నామ మాత్రం గానే మిగిలిపోయింది. ఇటీవలి దుబ్బాక, జి హెచ్ ఎం సి, నాగార్జున సాగర్, ఎన్నికల్లో, స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో కనీసం ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. 2019లో ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం కోల్పోయిన చంద్రబాబు అక్కడ పార్టీ విషయాలపైనే పెద్దగా దృష్టి సారించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్ రమణ తెలుగుదేశం పార్టీని వీడి టిఆర్ ఎస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

మృదు స్వభావిగా, బలమైన బిసి నేతగా గుర్తింపు పొందిన ఎల్.రమణ ను పార్టీలోకి తీసుకొని శాసనమండలికి పంపాలని కెసియార్ ఆలోచిస్తున్నారు. తద్వారా ఈటెల రాజేందర్ పార్టీ విడిచి వెళ్ళిన తరువాత పార్టీకి ఏదైనా నష్టం జరిగితే దాన్ని రమణతో పూడ్చుకోవచ్చనే ఆలోచనతో టి ఆర్ ఎస్ అధినేత ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నెలాఖరులోపు రమణ చేరడం ఖాయమని తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్