నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా తాజాగా నాని మీడియాతో పంచుకున్న చిత్ర విశేషాలు ఆయన మాటల్లోనే..
థియేటర్లో నన్ను నేను చూసుకోవడం కూడా మిస్ అవుతున్నాను. గత ఏడాది ‘V’ సినిమాతో వచ్చాను. ఈ సారి ‘టక్ జగదీష్’తో వస్తున్నాను. అయితే.. పరిస్థితులు అనుకూలించకపోవడంతోనే ఇలా రావాల్సి వచ్చింది. ఎప్పుడైతే అంతా సెట్ అవుతుందో అప్పుడు థియేటర్‌లోకి వచ్చేందుకు రెడీగా చాలా సినిమాలు ఉన్నాయి. నేను ఏదో సినిమా డబ్బింగ్ పనుల్లో ఉన్నప్పుడు శివ ఫోన్ చేశారు. ఓ కథను చెప్పాలని అన్నారు. అప్పటికే ‘మజిలీ’ సూపర్ హిట్ అయి ఉంది. మళ్లీ అలాంటి కథే చెబుతారేమో అనుకున్నాను. ఆ జానర్ అయితే వద్దని చెబుదామని అనుకున్నాను. ఇలా ఫోన్లో నో చెప్పడం ఎందుకు.. నేరుగా చెబుదామని అనుకున్నాను. అప్పటికీ కథ అంతా కూడా పూర్తి కాలేదు. కానీ ఓపెనింగ్ లైన్ చెప్పాడు.
భూదేవీపురం, భూమి తగాదాలు అని చెప్పారు. నాజర్ లాంటి పెద్ద మనిషి వాయిస్ వినిపిస్తుంది.. అరేయ్ జగదీ.. మగవాడు ఏడవకూడదు.. అమ్మాయిలను ఏడిపించకూడదు అని చెబుతాడు. అలా చెప్పడంతోనే కనెక్ట్ అయిపోయాను. ఇంత వరకు సంబంధం లేని జానర్‌ను టచ్ చేయబోతోన్నాడని తెలిసింది. శివ నిర్వాణ ఎమోషన్‌ను బాగా హ్యాండిల్ చేయగలరు. అలాంటి వారు ఫ్యామిలీ సినిమాలను ఇంకా బాగా చేయగలరు. ఇలాంటి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. దానికి శివ నిర్వాణ దర్శకుడు అవ్వడం ఇంకా హ్యాపీ.
ఈ సినిమా అనుకున్నప్పుడు టైటిల్ ‘టక్ జగదీష్’ కాదు. అది క్యారెక్టర్ పేరు. ఇందులో ప్రతీ ఒక్క పాత్రకు మంచి మంచి క్యారెక్టర్ పేర్లు ఇచ్చారు. శివ నిర్వాణలో నాకు అదే నచ్చుతుంది. ఆయన చూసిన, తెలిసిన ఫ్యామిలీ మెంబర్ల పేర్లు పెడతాడు. అందుకే అవి రియలిస్టిక్‌గా ఉంటాయి. అదే పెద్ద బలం. అలా నాకు జగదీష్ అని పెట్టారు. అయితే దానికి టక్ అని ముందు పెట్టారు. అతను టక్ ఎందుకు వేసుకుంటాడు అనేది ద్వితీయార్థంలో రివీల్ చేస్తారు. అది శివ ఎంతో అద్బుతంగా రాశారు. ఆ సీన్‌కు ఎంతో మంది కనెక్ట్ అవుతారు.
రీతూ వర్మ ఏమో లవ్ ఇంట్రెస్ట్. ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉన్న సినిమాలో రీతూ వర్మ ఓ రిలాక్స్ గా అనిపిస్తుంది. ఈ కథ, డ్రామాకు ఆయువుపట్టు ఐశ్వర్య రాజ్ పాత్ర. చంద్రమ్మ పాత్రలో ఐశ్వర్య కనిపిస్తారు. చంద్రమ్మ కోసం టక్ జగధీష్ ఎంత దూరం వెళ్తాడన్నదే కథ. ఫ్యామిలీలో ఉండే అన్ని ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. కానీ ఈసినిమాకు ముందుండే రెండు ఎమోషనల్ క్యారెక్టర్స్ అన్నదమ్ములు. బోసు, జగదీష్ మధ్య ఉండే సంఘర్షణను శివ నిర్వాణ ఎంతో అద్భుతంగా హ్యాండిల్ చేసేశారు. హీరో ఎంత తపన పడతాడో అనే యాంగిల్‌లోనే తెలుగు సినిమాలుంటాయి. కానీ హీరో నాన్న యాంగిల్‌లోంచి చూడరు. కానీ శివ నిర్వాణ సినిమాలో ప్రతీ క్యారెక్టర్‌లోకి వెళ్తారు. అందువల్లే ప్రతీ పాత్ర హైలెట్ అవుతుంది.
నాని ఫాస్ట్ గా సినిమాలు రెడీ చేస్తున్నాడు. ఫస్ట్ వేవ్‌లో ఒకటి, సెకండ్ వేవ్‌లో మరొకటి వచ్చాయి. మిగతా వాళ్ల సినిమాలు రెడీగా లేవు. అందుకు ఎగ్జిబిటర్లు అలా అన్నప్పుడు బాధేసింది. థియేటర్లు సెట్ అయితే.. నేను మూడు సినిమాలు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాను. ‘టక్ జగదీష్’ వెళ్లిపోతోందని వారు బాధపడుతున్నారు. కానీ మీరు రెడీ అంటే.. రెండు మూడు సినిమాలు ఇచ్చేందుకు నేను కూడా రెడీగా ఉన్నాను. పరిస్థితులు బాగా లేకపోయినా కూడా ప్యాండమిక్ సమయంలోనూ ఎంతో కష్టపడ్డాం. ఇలాంటి సమయంలోనూ ఫ్యామిలీ అంతా ఇంట్లోనే కూర్చుని చూసే మంచి సినిమా ఇస్తున్నాను. ఇక ఈ కోవిడ్ పాండమిక్ సమయంలో నా సినిమాల వల్ల ఎంతో మందికి పని దొరికింది. రేపు థియేటర్లు రెడీ అవ్వగానే ‘శ్యాం సింఘరాయ్’ కూడా ఉంది. ఇంతకంటే ఏం కావాలి. ఎలా చెప్పాలి.
HIT సీక్వెల్ అద్భుతంగా ఉండబోతోంది. మొదటి పార్ట్ కంటే సూపర్‌గా ఉంటుంది. అడివి శేష్‌తో చేస్తున్నాం. దాదాపుగా డెబ్బై శాతం షూటింగ్ అయింది. ఇక మూడో పార్ట్ అంతకు మించి అనేలా ఉంటుంది. మీట్ క్యూట్ కూడా స్పెషల్‌గా ఉండబోతుంది. దానికి మా అక్క దర్శకురాలు. చిన్నప్పటి నుంచి తిరిగిన, చూసిన మా అక్కలో ఇంత టాలెంట్ ఉందా? అని షాక్ అయ్యాను. మీట్ క్యూట్‌తో అక్క నన్ను మరిచిపోయేలా చేస్తుంది. అంటే ‘సుందరానికి’ సినిమా ఇచ్చే సౌండ్ మామూలుగా ఉండదు. పరిస్థితులు చక్కబడితే ‘శ్యాం సింఘరాయ్‌ను రెడీ చేస్తాను. సీటీమార్, తలైవి అద్భుతంగా విజయం సాధించాలి. అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకుని థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడండి. అలాగే టక్ జగదీష్ చిత్రాన్ని కూడా చూడండి అంటూ ఇంటర్వ్యూ ముగించాడు నాని.