Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

కౌలు రైతులకు రుణాలు అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్యాంకర్లను కోరారు. కౌలు రైతులకు క్రాప్‌ కల్టివేటర్‌ రైట్‌ కార్డ్స్‌(సీసీఆర్‌సీ)ను అందిస్తున్నామని, ఇప్పటివరకూ 4,91,330 మందికి ఈ కార్టులను ఇచ్చామని వారి వివరాలు కూడా ఇ–క్రాపింగ్‌లో పొందుపరిచామని తెలిపారు. వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యే ప్రతి ఒక్కరికీ పంటరుణాలు అందడం చాలా ముఖ్యమైన విషయమని సిఎం అభిప్రాయపడ్డారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సిఎం అధ్యక్షతన 216వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బ్యాంకర్లకు పలు విజ్ఞప్తులు, సూచనలు చేశారు.

 • కోవిడ్‌లాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్న బ్యాంకులకు ధన్యవాదాలు
 • కోవిడ్‌ విపత్తు కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించింది. పంపిణీ వ్యవస్థ దెబ్బతింది. ఉపాధిమార్గాలు దెబ్బతిన్నాయి
 • గడచిన 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 2019–20లో దేశంలో పన్నుల ఆదాయం మొత్తం 38శాతం తగ్గింది
 • 2020–21లో కూడా కోవిడ్‌ విస్తరణను అడ్డుకోవడానికి లాక్‌డౌన్, ఇరత్రా ఆంక్షల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం కొనసాగింది
 • దేశ జీడీపీ వృద్ధిరేటు 25శాతం మేర పడిపోయింది. మొదటి త్రైమాసికంలో అయితే 24.43శాతం మేర జీడీపీ వృద్ధిరేటు పడిపోయింది.
 • ఈ క్లిష్ట సమయంలో బ్యాంకర్ల సహకారం కారణంగా దేశంతో పోలిస్తే ఏపీ సమర్థవంతమైన పనితీరు చూపింది.
 • 2020–21లో దేశ జీడీపీ 25శాతం మేర తగ్గితే ఏపీలో 2.58శాతానికి పరిమితమైంది. ఇందులో కీలక పాత్ర పోషించిన బ్యాంకర్లను అభినందిస్తున్నాను
 • గతేడాదితో పోలిస్తే టర్మ్‌ రుణాలు రూ.3,237 కోట్లు తక్కువగా నమోదయ్యాయి. వ్యవసాయరంగానికి 32 శాతం తక్కువగా రుణపంపిణీ ఉన్నట్టు గణాంకాలద్వారా తెలుస్తోంది.
 • అదే సమయంలో పంటరుణాలు 49శాతం అధికంగా ఇచ్చినట్టు కనిపించడం సంతోషదాయకం.
 • ఇ– క్రాపింగ్‌ అనేది సీసీఆర్‌సీ కార్డులకే కాదు, వడ్డీలేని పంటరుణాలకు, ఇన్‌పుట్‌ సబ్సిడీకే కాదు, ఇన్సూరెన్స్‌కు.. .ఇలా అన్నింటికీ అనుసంధానం అవుతుంది. దీనివల్ల బ్యాంకర్లు ఇచ్చే రుణాలకు భద్రత కూడా ఉంటుంది.

 • ఇప్పటికే బ్యాంకర్లు 9160 ఆర్బీకేలను మ్యాపింగ్‌చేసి అక్కడ బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లను పెట్టాలని నిర్ణయించడం ముదావహం. ఇప్పటికే 6538 కరస్పాండెంట్లను పెట్టడం ప్రశంసనీయం.
 • మిగిలిన చోట్లకూడా వీలైనంత త్వరగా బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లను నియమించాలని కోరుతున్నాను. ప్రతి ఆర్బీకే కేంద్రంలో ఒక బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ ఉండాలి.
 • ఇది అంతిమంగా డిజిటలైజేషన్‌ మార్గంలో పెద్ద అడుగు అవుతుంది.
 • గ్రామాల్లోని ఆర్బీకేల్లో ఉన్న బ్యాంకింగ్‌ బిజినెస్‌ కరస్పాండెంట్లు.. బ్యాంకులుగా మారినప్పుడే డిజిటలైజేషన్‌ దిశగా గొప్ప అడుగు వేసినట్టు.
 • వ్యవసాయానికి సంబంధించి రుణాలు ఇవ్వడం, ఇ– క్రాపింగ్‌ ద్వారా వారికి రుణాలు ఇవ్వడం.. ఇవన్నీ ఆర్బీకేల్లోని బిజినెస్‌ కరస్పాండెంట్ల ద్వారా చేయగలిగితే.. గొప్ప విప్లవాన్ని మనం చూడగలుగుతాం.
 • దేశంలో ఆదర్శ రాష్ట్రంగా ఏపీని చూపించగలగాలి. ఆర్బీకేలను తమవిగా బ్యాంకర్లు భావించాలి. సంపూర్ణ డిజిటలైజేషన్‌కు ప్రతిరూపాలుగా ఆర్బీకేలను బ్యాంకర్లు తీర్చిదిద్దాలి.
 • వైయస్సార్‌ చేయూత ద్వారా మహిళలు గణనీయంగా లబ్ధి పొందుతున్నారు. ఈ కార్యక్రమంపై బ్యాంకర్లు ప్రత్యే శ్రద్ధపెట్టాలని కోరుతున్నాను.
 • దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మంది మహిళలకు ఇళ్లపట్టాలు రిజిస్ట్రేషన్‌చేసి ఇచ్చాం.
 • ఇంటి నిర్మాణంకోసం కనీసం ఒక్కొక్కరికి రూ.35వేల రుణం ఇచ్చే దిశగా బ్యాంకులు అడుగులు ముందుకేయాలి.
 • జగనన్న తోడు కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం. 9.05 లక్షలమంది చిరువ్యాపారులు జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందారు. ప్రతి ఒక్కరికీ రూ.10వేల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. దీనిపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.
 • ప్రతి ఆరునెలలకు ఒకసారి కొత్తగా దరఖాస్తులు తీసుకోవడంతోపాటు, అందులో అర్హులైన వారికి రుణాలు మంజూరు ప్రక్రియ కొనసాగాలి. దీనిపై బ్యాంకులు దృష్టిసారించాలి.
 • ఎంఎస్‌ఎంఈలకు తోడుగా నిలవాలని బ్యాంకర్లను కోరుతున్నాను.
 • ఒక్కో పరిశ్రమ కనీసం 10 నుంచి 20 మందికి ఉపాధినిస్తున్నాయి. వీరికి తగిన తోడ్పాటు అందించాలని బ్యాంకర్లను కోరుతున్నా

ఈ సమావేశంలో క్యాంప్‌ కార్యాలయం నుంచి ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి కె సునీత,  ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, నాబార్డు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సుధీర్‌ జన్నావర్,  ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ వి బ్రహ్మానందరెడ్డి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వర్చువల్‌గా ఆర్‌బీఐ రీజనల్‌ డైరెక్టర్‌ కె నిఖిల, యూబీఐ ఈడీ దినేష్‌ కుమార్‌ గార్గ్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com