సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకు రెండు విడతల పోలింగ్ జరిగింది. రెండు విడతల పోలింగ్ సరళి విశ్లేషిస్తే విస్తు గొలిపే అంశాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారం పొందేందుకు కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో కమలానికి ఎదురీత కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. మొదటి విడత పోలింగ్ తర్వాత ప్రధాని మోడీ ప్రసంగాలలో వచ్చిన మార్పే ఇందుకు నిదర్శనమని చెపుతున్నారు.
80 ఎంపి సీట్లున్న యూపీలో రెండు విడతల్లో 16 స్థానాలకు పోలింగ్ పూర్తి అయింది. వీటిలో బీజేపీ ఎదురుగాలి స్పష్టంగా కన్పించింది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై యువ ఓటర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ధరల పెరుగుదలకు కేంద్రంలోని బీజేపీనే కారణమని పేదలు నమ్ముతున్నారు.
ఇటీవల జరిగిన ఉద్యోగ నియామక పరీక్షల్లో పేపర్లు లీక్ కావడం రాష్ట్రంలోని యువ నిరుద్యోగులను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. రాష్ట్రంలోని పేదలతో పాటు రాజ్‌పుత్ వర్గాలు కమలం పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఇండియా కూటమిలో ఎస్పీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయగా, ఆర్‌ఎల్డీ, బీజేపీ భాగస్వామిగా ఉన్నాయి. బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగింది.
రైతుల ఉద్యమం తదితర కారణాల వల్ల రాజ్‌పుత్‌లలోనూ కమలనాథుల పట్ల ఆగ్రహం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో కమలనాథులకు నిరాశ తప్పకపోవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మొదటి విడతలో మాదిరిగానే రెండో విడత ఎన్నికల్లో సైతం రాజ్‌పుత్ వర్గాలు బీజేపీపై తమ ఆగ్రహాన్ని ప్రదర్శించినట్టు భావిస్తున్నారు. రెండో విడతలోని మూడు స్థానాల్లో వీరి ప్రాబల్యం గణనీయంగా ఉంది. రాజ్‌పుత్‌ల కోపాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇండియా కూటమి, బీఎస్పీలు ప్రయత్నిస్తున్నాయి.
ఈ ఎన్నికలు బీజేపీ-ఆర్‌ఎల్డీ కూటమికి అగ్రిపరీక్షగా మారాయి. భాగ్‌పట్, మథుర, అలీగఢ్ నియోజకవర్గాల్లో ఇరు వర్గాల మధ్య పొత్తు ఉన్న లక్షణాలు కన్పించడం లేదని వార్తలు వస్తున్నాయి. అక్కడ ఎడమొహం, పెడమొహంగానే ఉన్నాయని, ఈ రెండు పార్టీల మధ్య ఇటీవల జరిగిన సమావేశాల్లో పార్టీ కార్యకర్తల మద్య విభేదాలు ప్రస్ఫుటంగా కన్పించాయంటున్నారు.
యూపీలో బీజేపీ చారిత్రక ఓటమిని చవిచూడబోతున్నదని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ జోస్యం చెప్పారు. బిజెపికి రిజర్వేషన్ అమలు ఉద్దేశం లేకనే ఉద్యోగాల భర్తీ చేపట్టడం లేదని ఆరోపించారు. పదిసార్లు నోటిఫికేషన్లు ఇచ్చి ఒక్కటి పూర్తి చేయలేదని… ఉద్దేశపూర్వకంగానే ప్రశ్నాపత్రాల లీకేజీ జరుగుతోందని విమర్శించారు.
ఈసారి యూపీలో రాజకీయ భూకంపం సంభవించబోతున్నదని ప్రముఖ రాజకీయ విశ్లేషణ జరుగుతోంది. ఈసారి బీజేపీ ఇక్కడ 70 సీట్ల సంగతి దేవుడు ఎరుగు 50 సీట్లు కూడా పార్టీకి దక్కకపోవచ్చని అంటున్నారు. బీజేపీ ఎంపీలు, స్థానిక నేతల పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.. మూడోసారి బీజేపీకి అధికారం ఇస్తే నియంతృత్వం ప్రారంభమవుతుందని ప్రచారం అధికంగా జరుగుతోంది.
అయితే హిందువులతో పాటు ముస్లిం మహిళలు యోగి పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుండరాజ్ లేని పాలనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. యుపి ఓటర్లు మోడీతో పోలిస్తే యోగి విధానాల పట్ల సంతృప్తిగా ఉన్నారు.
-దేశవేని భాస్కర్