Thursday, November 21, 2024
Homeఅంతర్జాతీయంఉయ్ ఘర్ ముస్లింలపై కథనానికి ‘పులిట్జర్’

ఉయ్ ఘర్ ముస్లింలపై కథనానికి ‘పులిట్జర్’

భారత సంతతి జర్నలిస్టు మేఘ రాజగోపాలన్ అమెరికా అందజేసే ప్రతిష్టాత్మకమైన జర్నలిజం అవార్డు ‘పులిట్జర్’ కు ఎంపికయ్యారు. ఉయిఘర్ ముస్లిం ప్రజలను పెద్ద ఎత్తున సామూహిక నిర్బంధం చేసి చైనా అనుసరిస్తున్న దమన కాండను ప్రపంచానికి చాటినందుకు ఆమెకు ఈ పురస్కారం లభించింది. శాటిలైట్ టెక్నాలజీ ద్వారా ఆమె అక్కడి ప్రభుత్వం వారిపట్ల వ్యవహరిస్తున్న పాశావిక చర్యలను ఆమె తెలియచెప్పారు. చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో ఉయిఘర్ మైనారిటీ జాతి దశాబ్దాలుగా తీవ్రమైన అణచివేతకు గురవుతోంది. అత్యంత సాహసోపేతంగా ఇద్దరు సహోద్యోగులతో కలిసి ఆమె ఈ పరిశోధన చేశారు. అంతర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో ఆ ఇద్దరితో కలిసి ఈ అవార్డును రాజగోపాలన్ పంచుకోనున్నారు.

తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న లా ఎన్ఫోర్స్మెంట్ అధికారి నిర్వాకాన్ని బైట పెట్టిన టంపా బే టైమ్స పరిశోధనాత్మక జర్నలిస్టు నీల్ బేడి కి స్థానిక కేటగిరిలో అవార్డు లభించింది. బేడి కూడా భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం.

మినియాపోలిస్ లో అమెరికా-ఆఫ్రికన్ జార్జ్ ఫ్లాయిడ్ పై పోలీసు అధికారి వ్యవహరించిన అమానుష కాండను, ఫ్లాయిడ్ మరణాన్ని తన కెమెరా ఫోన్ లో బంధించిన డర్నేల్లా ఫ్రాజిఎర్ కు నాన్-జర్నలిస్టు కేటగిరిలో ప్రత్యేక అవార్డు ప్రకటించారు.

జర్నలిజం తో పాటు వార్తాపత్రిక, పత్రిక, ఆన్లైన్ జర్నలిజం, సాహిత్యం, సంగీతాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వారికి పులిట్జర్ ప్రదానం చేస్తారు. ఈ బహుమతిని 1917 లో ప్రచురణకర్త జోసెఫ్ పులిట్జర్ స్థాపించారు. కొలంబియా విశ్వవిద్యాలయం ఈ అవార్డులు నిర్వహిస్తుంది. ప్రతి ఏటా 21 విభాగాల్లో బహుమతులు ప్రదానం చేస్తారు. ఇరవై విభాగాలలో, విజేతకు ఒక సర్టిఫికెట్టును, 15,000 అమెరికన్ డాలర్ల నగదు పురస్కారాన్ని అందజేస్తారు. ప్రజా సేవా విభాగంలో విజేతకు బంగారు పతకం ఇస్తారు. 105 ఏళ్ళ నుంచి ఈ అవార్డుల పరంపర కొనసాగుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్