Saturday, June 29, 2024
HomeTrending Newsఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సంధు

ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సంధు

నాటకీయ పరిణామాల మధ్య కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న కమిషనర్ల పోస్టులను గురువారం కేంద్రం భర్తీ చేసింది. ప్రధానమంత్రి అధికారిక నివాసంలో జరిగిన సెలక్షన్‌ కమిటీ సమావేశంలో ప్రధాని మోడితో పాటు న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదరి పాల్గొన్నారు. మాజీ ఐఏఎస్ లు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సంధులను కమిషనర్లుగా కమిటీ ఖరారు చేసింది.

జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సంధు 1988 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారులు. పంజాబ్‌కు చెందిన సంధు ఉత్తరాఖండ్ ఐఏఎస్ కేడర్‌కు చెందినవారు. జ్ఞానేష్ కుమార్ కేరళ కేడర్‌కు చెందినవారు. సంధు గతంలో ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శిగా, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌తో సహా పలు కీలక ప్రభుత్వ పదవులు చేపట్టారు. జ్ఞానేష్‌ కుమార్‌ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతోపాటు అమిత్ షా నేతృత్వంలోని సహకార మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు.

వీరిద్దరి ఎంపికను కాంగ్రెస్‌ నేత వ్యతిరేకించారు. సమావేశం అనంతరం ఆయన కమిషనర్ల నియామక ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్రం ఎన్నికల కమిషనర్ల పేర్లను ఇప్పటికే ఖరారు చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం ఎవరు కావాలనుకుంటే.. వారే ఎన్నికల కమిషనర్లని పేర్కొన్నారు. కమిటీలో ప్రభుత్వానికి మెజారిటీ ఉందని, దాంతో పేర్లను ఎంపిక చేసుకోవచ్చన్నారు.

భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో కీలక పదవికి నియామకం ఈ పద్ధతిలో జరుగకూడదు. సమావేశానికి పది నిమిషాల ముందు నాకు ఆరు పేర్లు ఇచ్చారు. ఇంత తక్కువ సమయంలో నేనేం చెబుతానని అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయశాఖకు బుధవారం ఆయన లేఖ రాస్తూ అభ్యర్థుల పేర్లు, బయోడేటా సమాచారం కోరితే 212 పేర్లు ఇచ్చారని.. ఇవాళ సమావేశానికి పది నిమిషాల ముందు ఆరు పేర్లను నిర్ణయించారని.. ఇందులో ఇద్దరిని ఎంపిక చేశారన్నారు.

సీఈసీ రాజీవ్‌ కుమార్‌ పదవీ కాలం కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుంది. రాజీవ్ కుమార్ తర్వాత చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌గా అరుణ్ గోయెల్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉండగా.. ఈలోగా ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అరుణ్ గోయెల్‌ను కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి.

కొత్త చట్టం ప్రకారం.. ఎన్నికల కమిషనర్‌ను ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కేబినెట్‌ మంత్రితో కూడిన కమిటీ నియమించింది. ఇదిలా ఉండగా.. సీఈసీ, ఈసీల నియామకంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పాతచట్టం ప్రకారమే సీఈసీ, ఈసీలను నియమించాలని.. సెలక్షన్‌ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండేలా చూడాలని ఏడీఆర్‌ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ పిటిషన్‌పై త్వరలోనే సుప్రీంకోర్టు విచారించనున్నది.

ఆకస్మికంగా అరుణ్ గోయల్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే అంశంపై అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏరి కోరి తీసుకొచ్చిన అధికారి ఎన్నికల ముంగిట్లో ఉన్నపళంగా రాజీనామా చేయటంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు కమిషనర్ల నియామకంపై శుక్రవారం ఉదయం సమావేశం అని ఈ రోజు(గురువారం) సమావేశం ఏర్పాటు చేసి కొత్త కమిషనర్లను నియిమించటం అనుమానాలకు తావిస్తోంది. శుక్రవారం ఉదయం ప్రధాని గుజరాత్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాక మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్