Sunday, September 8, 2024
HomeTrending NewsManipur: మణిపూర్‌లో శాంతి కోసం అఖిలపక్ష సమావేశం

Manipur: మణిపూర్‌లో శాంతి కోసం అఖిలపక్ష సమావేశం

మణిపూర్‌ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో అల్లర్లను అదుపు చేసి శాంతి నెలకొల్పే ఉద్దేశంతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ఈ నెల 24న న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు ఆ శాఖ అధికార ప్రతినిధి గురువారం ట్వీట్‌ చేశారు. 50 రోజులుగా అల్లర్లతో రాష్ట్రం అట్టుడికిపోతున్నప్పటికీ కేంద్రం నుంచి స్పందన లేకపోవడంపై అన్ని వర్గాల నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. మౌనం వహిస్తున్న ప్రధాని మోదీ తీరును నిరసిస్తూ మణిపూర్‌వాసులు తీవ్రంగా స్పందించారు. మన్‌ కీ బాత్‌లో మణిపూర్‌ గురించి మాట్లాడకపోవడంతో వారు ఆగ్రహించారు.

మణిపూర్‌లో అల్లర్లు జరుగుతుంటే.. ఢిల్లీలో చర్చలు జరపడమేంటని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తీవ్రమైన స్పందనను దేశ ప్రజలు ఆశించారని, ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం నిర్వహించాల్సిందని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌ అభిప్రాయపడ్డారు. 50 రోజులుగా రాష్ట్రంలో ఇంటర్నెట్‌ సేవలపై నిషేధం విధించడాన్ని ఇంటర్నెట్‌ ఫ్రీడం ఫౌండేషన్‌ తప్పుబట్టింది.

ఓవైపు శాంతి చర్చలకు సన్నాహాలు జరుగుతుండగా, మరోవైపు కాల్పులు కొనసాగుతున్నాయి.గురువారం ఐఈడీ బాంబు పేలి ఇద్దరు పౌరులు మృతిచెందారు. బిష్ణుపూర్‌ జిల్లాలోని క్వాట్కలో ఓ కారులో అమర్చిన బాంబు పేలడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోగా, ఇద్దరు మైనర్లు సహా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఐదుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్