తమిళనాడులో వారసత్వ రాజకీయాలు మరోసారి తెరమీదకు వచ్చాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, డీఎంకే యూత్ వింగ్ సెక్రెటరీ ఉదయనిధి స్టాలిన్‌కు మంత్రివర్గంలో చోటుపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఉదయనిదికి మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తే వచ్చే ఎన్నికల నాటికి ప్రజల్లోకి మరింత దూకుడుగా వెళ్ళటానికి ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈనెల 14న జరుగున్న రాష్ట్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరుగనుంది. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధికి క్యాబినెట్‌లో స్థానం కల్పిస్తారని వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై అధికార పార్టీ కానీ, ఉదయనిధి కానీ స్పందించకపోవడంతో అది నిజమేనని విశ్లేషకులు అంటున్నారు.
పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా తన వారసుడిని మంత్రివర్గంలోకి తీసుకుని యువజన సంక్షేమ, క్రీడా శాఖ బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందని తెలుస్తున్నది. ప్రస్తుతం ఆ శాఖ మంత్రిగా మెయ్యనాథన్ శివ కొనసాగుతున్నారు. ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం చెన్నైలోని చెపాక్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం యువజన నాయకుడుగా ఉన్న ఉదయనిది పార్టీ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే పాలన అనుభవం రావటం… ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు అవకాశం ఉంటుందని పార్టీ నేతలు అంటున్నారు.