క్రికెటర్లు తమ కుటుంబాలను వెంట తెచ్చుకునేందుకు ఇంగ్లాండ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు ఎల్లుండి (జూన్ 3) లండన్ కు పయనమవుతున్నారు. ఆటగాళ్ళు, సహాయ సిబ్బంది, మేనేజర్లు, తమతో పాటు కుటుంబ సభులను కూడా తీసుకురావోచ్చని తెలిపింది.
కోవిడ్ రెండో దశలో ఇండియాలో పెద్ద ఎత్తున కేసులు నమోదైన దృష్ట్యా కేవలం ఆటగాళ్ళతో పాటు పరిమిత సంఖ్యలో సహాయ సిబ్బందిని తెచ్చుకోవాలని ఇంగ్లాండ్ ప్రభుత్వం మొదట్లో సూచించింది. కానీ నెలల తరబడి పర్యటన ఉండడంతో కుటుంబ సభ్యులకు కూడా అనుమతి ఇవ్వాలని అటు ఆటగాళ్ళు, ఇటు బిసిసిఐ…. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు దృష్టికి తీసుకెళ్ళడంతో ఎట్టకేలకు యునైటెడ్ కింగ్ డమ్ ప్రభుత్వం ఓకే చెప్పింది.
ప్రస్తుతం ముంబైలో ఓ స్టార్ హోటల్ లో క్వారంటైన్ గడుపుతున్న రెండు జట్లు ఎల్లుండి బయల్దేరి లండన్ చేసుకుంటాయి. విరాట్ నేతృత్వంలోని పురుషుల జట్టు జూన్ 18 నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ తో పాటు ఇంగ్లాండ్ తో ఐదు టెస్టులు ఆడనుంది.
మరోవైపు మహిళల జట్టు ఒక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలు, మూడు టి-20 మ్యాచ్ లు ఆడనుంది. టెస్టు జట్టుకు మిథాలీ రాజ్, పరిమిత ఓవర్ల జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తారు.
జూలై మూడో వారంలో మహిళా జట్టు ఇండియాకు తిరిగి వస్తుంది. పురుషుల జట్టు సుదీర్ఘ షెడ్యూల్ ను సెప్టెంబర్ 14తో పూర్తి చేసుకుని అక్కడినుంచే ఐపిఎల్ కొనసాగించేందుకు ఎమిరేట్స్ కు వెళుతుంది.