యూనిఫామ్ సివిల్ కోడ్ నియమ, నిబంధనల కోసం త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి ప్రకటించారు. ఉత్తరకాశి జిల్లాలో ఈ రోజు బిస్సు మేళాలో పాల్గొన్న ముఖ్యమంత్రి యూనిఫామ్ సివిల్ కోడ్ తమ ప్రభుత్వ ప్రాధాన్యతలో అగ్ర స్థానంలో ఉందన్నారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రమైన ఉత్తరాఖండ్ లో అన్ని వర్గాలు, మతాల వారికి రక్షణ ఉంటుందని, యూనిఫామ్ సివిల్ కోడ్ ను అందరికి మేలు చేసే విధంగా రూపొందిస్తామని సిఎం దామి స్పష్టం చేశారు.
అన్ని వర్గాల వారికీ పెండ్లి, విడాకులు, వారసత్వం వంటి అంశాల్లో ఒకే చట్టం వర్తింపచేసేలా యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)ను అమలు చేయనున్నట్లు ఇదివరకే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో యూసీసీని అమలు చేయనున్న తొలి రాష్ట్రం తమదే కానుందన్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే యూసీసీని అమలు చేస్తామని బీజేపీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో హామీని ఇచ్చింది. కాగా, బీజేపీ పాలనలో ఉన్న గోవాలో ఇదివరకే యూసీసీ అమలులో ఉంది.
Also Read : భాషా ప్రేమికుల స్ఫూర్తి ప్రదాత