Sunday, January 19, 2025
HomeTrending Newsఉచిత వ్యాక్సిన్ కు రూ.35 వేల కోట్లు: నిర్మలా

ఉచిత వ్యాక్సిన్ కు రూ.35 వేల కోట్లు: నిర్మలా

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని కేంద్ర ఆర్ధికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నేడు విశాఖపట్నం జిల్లా చినవాల్తేర్ లోని ఉచిత వ్యాక్సిన్ సెంటర్ ను సందర్శించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 50కోట్ల మందికి వ్యాక్సిన్ అందించామని వెల్లడించారు. మరో రెండు కొత్త వ్యాక్సిన్ లకు అనుమతి ఇచ్చామని, ఆ వ్యాక్సిన్లు కూడా అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ఆమె వివరించారు. అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తోందని తెలిపారు. దీనికోసం 35 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి వెంట రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎంపీలు సత్యవతి, జీవీఎల్ నరసింహారావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ తదితరులు ఉన్నారు.

“ఆగస్ట్ 8 ఉదయం వరకు ఉన్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,36,22,073 మందికి వ్యాక్సిన్ డోసులు అందించడం జరిగింది. ఇందులో 1,74,80,069 మందికి మొదటి డోసు అందించగా 61,42,004 మందికి రెండవ డోసు వేయడం జరిగింది. రాష్ట్రంలో 2,127 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ సాగుతోంది” అని నిర్మలా సీతారామన్ కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

రాష్ట్రంలో రెండ్రోజుల పర్యటనకు వచ్చిన నిర్మలా నిన్న శ్రీకాకుళం జిల్లా పొందూరు లో జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం బిజెపి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు ఉదయం వ్యాక్సిన్ సెంటర్ సందర్శించారు, కాసేపట్లో కే.డి.పేటలో అల్లూరు సీతారామరాజు సమాధిని దర్శించుకొని సాయంత్రం తిరిగి ఢిల్లీ వెళతారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్