అమరావతి రైతులు చేస్తున్న పోరాటం చారిత్రాత్మకమని అని ప్రతిపక్ష నేత, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ప్రజా రాజధానికి 32,323 ఎకరాలు రైతులు త్యాగం చేశారని అయన గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం తలపెట్టిన మూడు రాజధానుల ప్రక్రియను నిరసిస్తూ అమరావతి పరిసర గ్రామాల ప్రజలు, రైతులు చేస్తున్న ఆందోళనలు నేడు 600 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతులు, రైతు కూలీలు భారీ ర్యాలీ నిర్వహించతలపెట్టారు. అయితే ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. రైతుల ఆందోళనలకు తెలుగుదేశం, ఇతర విపక్షాలు మద్దతిచ్చాయి. ఆందోళనలో పాల్గొనకుండా తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు నిలువరించారు. ముఖ్య నేతలను గృహ నిర్బంధం చేశారు.

ఈ సందర్భంగా మాజీ సిఎం చంద్రబాబు రాజధానిపై తన ఆవేదన మరోసారి వ్యక్తం చేశారు. ఈ ఉద్యమాన్ని ఎంత బలంగా అణచివేయాలని ప్రభుత్వం వ్యవహరిస్తుందో అంత ఉధృతంగా జరుగుతోందని చెప్పారు.   అమరావతి ఆంధ్రుల రాజధాని మాత్రమే కాదని, ఆంధ్రులకు 2 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించే కేంద్రమని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం చేస్తున్నది అమరావతిపై దాడి కాదని, రాష్ట్ర సంపదపై దాని అని అయన వ్యాఖ్యానించారు. కేవలం ద్వేషంతోనే ప్రజా రాజధానిని ధ్వంసం చేస్తున్నారని బాబు ఆరోపించారు. అమరావతి అంతానికి ప్రభుత్వం చేయని కుట్ర లేదని, జగన్ వ్యవహార శైలి వల్ల ఇప్పటికే అక్కడినుంచి 139 సంస్థలు తరలి వెళ్లిపోయాయని అయన ఆందోళన వెలిబుచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *