Saturday, November 23, 2024
HomeTrending NewsHLPF: పర్యాటక రంగంపై యుఎన్ సదస్సుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

HLPF: పర్యాటక రంగంపై యుఎన్ సదస్సుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి అరుదైన ఆహ్వానం అందింది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యాలయం వేదికగా.. జరగనున్న అంతర్జాతీయ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన వక్తగా ప్రసంగించే అవకాశం కిషన్ రెడ్డికి లభించింది. ఇప్పటివరకు ఈ అవకాశం లభించిన తొలి భారత పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కావడం గమనార్హం. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) ఆధ్వర్యంలో.. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వేదికగా జరగనున్న ప్రపంచ ‘హై లెవల్ పొలిటికల్ ఫోరమ్’ (HLPF) సమావేశాల్లో కిషన్ రెడ్డి ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజా ప్రతినిధులు, అంతర్జాతీయ ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారతదేశం జీ-20 సమావేశాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో.. కేంద్ర పర్యాటక మంత్రిగా, ‘జీ-20 దేశాల టూరిజం చైర్‌’ హోదాలో కిషన్ రెడ్డి ఈ అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొననున్నారు.
‘పర్యాటక రంగంలో సుస్థిరాభివృద్ధి లక్షాలను చేరుకోవడం; అత్యవసర కార్యాచరణ కోసం ప్రపంచ దేశాలను, వివిధ భాగస్వామ్య పక్షాలను (వ్యాపార సంస్థలు) ఏకం చేయాల్సిన ఆవశ్యకత’ ఇతివృత్తం (థీమ్)తో జూలై 13, 14 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. పర్యాటక రంగంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే లక్ష్యంతో అవసరమైన అన్ని ప్రయత్నాలు చేసేందుకు ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్వహిస్తోంది.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే క్రమంలో సాధించిన ప్రగతిని ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న ఈ హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ (HPLF) వేదికగా సమీక్షించనున్నారు. సభ్యదేశాలు, ఐక్యరాజసమితి ఏజెన్సీలు, పౌరసమాజం, ఇతర భాగస్వామ్య పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి.. తమ అనుభవాలను పంచుకోవడం, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో అమలుచేస్తున్న ఉత్తమ పద్ధతులనుఅమలుచేయడంపై, సాధించిన ఫలితాలను, చేరుకోవాల్సిన లక్ష్యాలు, చేపట్టాల్సిన కార్యాచరణపై HLPF చర్చిస్తుంది.
G20 సమావేశాలకు ఇండియన్ ప్రెసిడెన్సీ ద్వారా అందిన అత్యున్నత స్థాయి మార్గదర్శనం, UNWTO ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలతోపాటుగా క్షేత్రస్థాయి వాస్తవాలకు అనుగుణంగా విధానపర నిర్ణయాలను డేటా రూపంలోకి తీసుకొస్తూ.. పర్యాటక రంగ అభివృద్ధికి ఈ సమావేశం ఓ వేదిక కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్