విమెన్ ప్రీమియర్ లీగ్ లో బెంగుళూరును ఓటమి బెంగ వెంటాడుతూనే ఉంది. నేడు యూపీ వారియర్స్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం మూటగట్టుకుంది. బెంగుళూరు 138 పరుగులకు ఆలౌట్ కాగా.. ఈ లక్ష్యాన్ని యూపీ వికెట్ నష్ట పోకుండా 13 ఓవర్లలోనే ఛేదించింది. అలేస్సా హేలీ 47 బంతుల్లో 18 ఫోర్లు, 1 సిక్సర్ తో 96; దేవికా వైద్య 31బంతుల్లో 5 ఫోర్లతో 36 పరుగులతో అజేయంగా నిలిచి గెలిపించారు.
ముంబై బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగుళూరు 29 పరుగులకు తొలి వికెట్ (కెప్టెన్ స్మృతి మందానా- 4) కోల్పోయింది. రెండో వికెట్ కు సోఫీ డివైన్ ఎలీస్ పెర్రీ లు 44 పరుగులు జోడించారు. డివైన్ 36 రన్స్ చేసి ఔట్ కాగా, పెర్రీ 52 పరుగులు చేసి ఆరో వికెట్ గా పెవిలియన్ చేరింది. మిగిలిన వారిలో శ్రేయంకా పాటిల్-15; ఎరిన్ బర్న్స్-12 మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. కనిష్క అహుజా-8; హిదర్ నైట్-2; రిచా ఘోష్-1; కోమల్ జంజాడ్-5(నాటౌట్); రేణుక సింగ్-3; సహానా పవార్ (డకౌట్) లు విఫలమయ్యారు.19.3 ఓవర్లలో 138 స్కోరుకు ఆలౌట్ అయ్యింది.
యూపీ బౌలర్లలో ఎక్సెల్ స్టోన్ 4; దీప్తి శర్మ 3; రాజేశ్వరి గాయక్వాడ్ ఒక వికెట్ పడగొట్టారు.
అలెస్సా హేలీకి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.