రాబోయే ఎన్నికల్లో గుజరాత్ లోని అన్ని అసెంబ్లీ స్థానాల నుంచి ఆమ్ ఆద్మీపార్టీ తలపడుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. 2022 లో జరిగే ఎన్నికల్లో 182 సీట్ల లో పోటి చేసి గుజరాత్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేజ్రివాల్ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు.
బిజెపి – కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపిన విషయం ప్రజలు గ్రహించారన్నారు. ఢిల్లీ లో ఉచిత విద్యుత్ ఇవ్వగలిగినపుడు గుజరాత్ లో ఎందుకు సాధ్యం కాదని అరవింద్ కేజ్రివాల్ ప్రశ్నించారు. 70 ఏళ్ళయిన గుజరాత్ ఆస్పత్రులు ప్రజలకు సరయిన రీతిలో సేవలు అందించే స్థితిలో లేవని విమర్శించారు.
గుజరాత్ లో మార్పు మొదలయిందని అందుకు నిదర్శనం సూరత్ మున్సిపల్ ఎన్నికల్లో 120 సీట్లకు గాను 27 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి కట్టబెట్టడమేనని కేజ్రివాల్ పేర్కొన్నారు. ఢిల్లీ నమూనా అభివృద్ధి ఈ రాష్ట్రానికి తీసుకురామని, మోడల్ అనేది ఏ రాష్ట్రానికి అది వేరుగా ఉంటుందని కేజ్రివాల్ వెల్లడించారు.
గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ బలోపేతం కోసం ఇకనుంచి తరచుగా వస్తానని కేజ్రివాల్ చెప్పారు. ప్రజా విశ్వాసాన్ని చురగొనేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణకు దిగుతామని వెల్లడించారు. నెల రోజులలోనే కేజ్రివాల్ రెండుసార్లు గుజరాత్ పర్యటనకు రావటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 2022 డిసెంబర్ లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీలు ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి.