ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ వచ్చే నెల 31 వ తేది లోపు పూర్తవుతుందని అమెరికా దేశాధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. తమ బలగాలు ఏ లక్ష్యంతో వచ్చాయో అది నెరవేరిందని ఆయన తెలిపారు. అమెరికా జాతీయ భద్రత బృందంతో సమావేశమైన బైడెన్ ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. పూర్తి రక్షణ చర్యల మధ్య నాటో బలగాలు తిరిగి వెలుతున్నాయని, బలగాల ఉపసంహరణకు ఇదే సరైన సమయమని బైడెన్ వెల్లడించారు.
అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పాలన పగ్గాలు తాలిబాన్ పరమవుతాయనే వార్తల్ని బైడెన్ ఖండించారు. సెప్టెంబర్ 11 దాడుల నేపథ్యంలో ఉగ్రవాదుల ఏరివేత మొదలు పెట్టిన అమెరికా, నాటో బలగాలు విజయవంతంగా ఆ పని పూర్తి చేశాయన్నారు. ఆఫ్ఘన్ ను ఉగ్రవాదుల నుంచి విముక్తి చేశామన్న అమెరికా అధ్యక్షుడు ఆ దేశ పునర్నిర్మాణం ప్రజల చేతుల్లో ఉందన్నారు. దేశ భవిష్యత్తు ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలో ఆఫ్ఘన్ లే నిర్ణయించుకోవాలన్నారు.
శాంతి చర్చల ద్వారానే హింసకు పరిష్కారం లభిస్తుందని, పొరుగు దేశాలు ఆఫ్ఘన్ లో శాంతి సుస్థిరతకు కృషి చేయాలని బైడెన్ పిలుపు ఇచ్చారు. మరో ఆరు నెలలు, ఏడాది పాటు అమెరికా బలగాలు ఆఫ్ఘన్ లో ఉండాలని కొందరు అంటున్నారని, ఆ చర్యలతో శాంతి నెలకొనదన్నారు. రెండు దశాబ్దాలుగా ఆఫ్ఘన్ పరిపుష్టి కోసం అమెరికాతో పాటు మిత్ర దేశాలు పనిచేశాయని, ఈ క్రమంలో 2300 మంది అమెరికా సైనికులు అమరులయ్యారని గుర్తు చేశారు.