Uttarpradesh Fifth Phase Elections :
ఉత్తరప్రదేశ్ ఐదో విడత పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటివరకు నాలుగు విడతల పోలింగ్ ప్రశాంతంగా జరగగా రేపు(ఆదివారం) జరగబోయే పూర్వాంచల్ పోలింగ్ కోసం అధికారులు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అక్రమాలకూ తావులేకుండా 12 జిల్లాల్లోని అనుమానిత ప్రాంతాల్లో అదనంగా పోలీసు బలగాలు మోహరించాలని, నేర చరిత్ర ఉన్నవారిని అవసరమైతే అదుపులోకి తీసుకోవాలని యుపి డిజిపిని ఆదేశించింది. బారాబంకి, చిత్రకూట్, గోండా, కౌశాంబి, అమేథీ, రాయ్ బరేలీ, అయోధ్య, బహ్రైచ్, ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్, శ్రావస్తి, సుల్తాన్‌పూర్ జిల్లాల్లోని 61 అసెంబ్లీ స్థానాలకు ఐదవ దశలో ఎన్నికలు జరగనున్నాయి.
పోటీలో ఉన్న 692 మంది అభ్యర్థుల్లో 185 మంది అంటే 27 శాతం మంది తమపై క్రిమినల్ కేసులను ప్రకటించగా, 141 మంది..21 శాతం మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు అంగీకరించారని ఏడిఆర్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక పేర్కొంది. ఎన్నికలు జరగనున్న 61 స్థానాల్లో 39 స్థానాలు… మొత్తం 64 శాతం “రెడ్ అలర్ట్ నియోజకవర్గాలు” అని నివేదిక పేర్కొంది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పోటీలో ఉన్న అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదు అయి ఉన్న నియోజకవర్గాలను రెడ్ అలర్ట్ నియోజకవర్గాలు అంటారు. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ప్రకటించిన 12మంది అభ్యర్థులు ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నేర చరిత్ర పై, వారి ఆర్థిక స్థితిపై అధ్యయనం చేసిన ఏడీఆర్ ఉత్తర ప్రదేశ్ ఎలక్షన్ వాచ్ అండ్ ది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఆర్థిక స్థితి పరంగా ఐదో విడత అభ్యర్థులకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఐదవ విడతలో పోటీ చేస్తున్న 692 మంది అభ్యర్థుల్లో 246 మంది అభ్యర్థులు కోటీశ్వరులు అని విశ్లేషణ పేర్కొంది. వారు కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది. వీరి శాతం దాదాపు 36 శాతం గా ఉందని వెల్లడించింది.
84 మంది అభ్యర్థులు రూ. 5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉండగా, 90 మంది రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు ఆస్తులు కలిగి ఉన్నారని పేర్కొంది. 150 మంది అభ్యర్థులు రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లుగా వెల్లడించింది. ఐదవ దశలో పోటీలో ఉన్న అత్యంత ధనవంతులైన ముగ్గురు పోటీదారులు అందరూ అధికార బీజేపీ అభ్యర్థులు అని ఏడిఆర్ విశ్లేషణ తెలిపింది. తిలోయ్ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన మయాంకేశ్వర్ శరణ్ సింగ్ ఆస్తుల విలువ రూ. 58 కోట్లుగా పేర్కొంది. ఆయన తర్వాతి స్థానాల్లో కుందా నుంచి ఎన్నికల బరిలోకి దిగిన సింధుజా మిశ్రా సేనాని 52 కోట్లకు పైగా ఆస్తులతో, అమేథీ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన సంజయ్ సింగ్ రూ. 50 కోట్లకు పైగా ఆస్తులతో ఉన్నారని వెల్లడించింది. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రతాపూర్‌కు చెందిన స్వతంత్ర అభ్యర్థి హీరా మణి అత్యల్ప ఆస్తులు కేవలం రూ. 8,000 కాగా, ప్రయాగ్‌రాజ్‌లోని మోజాకు చెందిన ఎల్‌జేపీ అభ్యర్థి హైదర్ అబ్బాస్ రూ. 8,900 ఆస్తులను ప్రకటించారు. బారాబంకిలోని కుర్సీ నుంచి స్వతంత్ర అభ్యర్థి సంతోష్ కుమార్ తన అఫిడవిట్‌లో రూ.11,100 ఆస్తులను ప్రకటించారు.