Friday, June 12, 2026
Homeసినిమా'లవ్ మీ'లో దెయ్యం ఆమెనేనా? 

‘లవ్ మీ’లో దెయ్యం ఆమెనేనా? 

వైష్ణవీ చైతన్యకి ఇప్పుడు యూత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘బేబీ’ సినిమాతో ఆమె కెరియర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ‘బేబీ’ సినిమా తరువాత ఆమె ఓ రెండు మూడు ప్రాజెక్టులు ఒప్పుకుంది. వాటిలో ఏ సినిమా ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఆశిష్ జోడీగా ఆమె చేసిన ‘లవ్ మీ’ సినిమా, థియేటర్లకు రావడానికి రెడీ అవుతోంది.

ఆశిష్ ను హీరోగా నిలబెట్టడానికి దిల్ రాజు తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్లోనే ఈ  సినిమా నిర్మితమైంది. ఈ నెల 25వ తేదీన థియేటర్లకు ఈ సినిమా రానుంది. దాంతో వైష్ణవీ చైతన్యకి ఈ సినిమా హిట్ తెచ్చిపెడుతుందా? అనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘బేబీ’ సినిమాలో వైష్ణవి పాత్రకి ప్రాధాన్యత ఎక్కువ. హీరోల స్థానాల్లో ఇద్దరు ఉన్నప్పటికీ, కథ ఆమె పాత్రను కేంద్రంగా చేసుకునే నడుస్తుంది. ఆమె గ్లామర్ .. రొమాన్స్ ఆ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది.

‘లవ్ మీ’ సినిమా విషయానికి వచ్చేసరికి ఆశిష్ హీరోగా కనిపిస్తున్నాడు. కథలో నాయిక వైష్ణవీ అయినప్పటికీ, హీరోతో పాటు ఆడియన్స్ అందరి దృష్టి దెయ్యంపైనే ఉంది. హీరో ప్రేమించేది .. కామించేది దెయ్యాన్నే. ‘అటువైపు వెళ్ళొద్దు .. ఆ వైపు చూడొద్దు’ అంటూ హీరోను హెచ్చరించే పాత్రలో వైష్ణవిని చూపిస్తున్నారు. ఈ సినిమాలో దెయ్యంగా కనిపించేది కూడా ఆమెనే అయితే ఆమె పాత్ర బలమైనదే అవుతుందనడంలో సందేహం లేదు. కానీ అసలు దెయ్యం ఎవరో .. ఆ ట్విస్ట్ ఏమిటో  సినిమా రిలీజ్ తర్వాత గాని తెలియదు. చూడాలి మరి ఈ సినిమా ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular