వేదాంత కంపెనీ ఏడాదిన్నర కిందట ఆర్భాటంగా ప్రకటించిన భారత తొలి సెమీ కండక్టర్ జాయింట్ వెంచర్ (జేవీ)ఆగిపోయింది. తైవాన్‌కు చెందిన గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్ ఈ ప్రాజెక్టుకు గుడ్‌బై చెప్పింది. జాయింట్ వెంచర్‌లో ఇకపై భాగస్వామిగా ఉండబోమని ప్రకటించింది. రూ.1.6 లక్షల కోట్ల పెట్టుబడితో గుజరాత్‌లో సెమీ కండక్టర్, డిస్‌ప్లే తయారీ ప్లాంట్లను నెలకొల్పేందుకు కిందటేడాది హాన్ హై టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్) భాగస్వామ్యంతో వేదాంత గ్రూప్ ఒక ఒప్పందంపై సంతకాలు చేసింది. అయితే ‘జేవీ నుంచి ఫాక్స్‌కాన్ పేరు తొలగించేందుకు కసరత్తు చేస్తున్నాం. ఇక నుంచి ఆ జేవీ పూర్తిగా వేదాంతకు చెందినదే’ అంటూ ఫాక్స్‌కాన్ సోమవారం సంచలన ప్రకటన చేసింది.
మహారాష్ట్రలో సెమీ కండక్టర్, డిస్‌ప్లే తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు వేదాంత-ఫాక్స్‌కాన్ కిందటేడాది ఫిబ్రవరిలో ముందుకొచ్చాయి. అయితే అదే ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగాల్సిఉన్నది. ఇంతలో ఈ వెంచర్ అనూహ్యంగా గుజరాత్‌కు తరలిపోయింది. దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రాజెక్టును గుజరాత్‌కు మళ్లించిందని విమర్శించాయి. 1.6 లక్షల కోట్లతో గుజరాత్‌లో ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్టు సెప్టెంబర్ 2022న ఇరు కంపెనీలు ప్రకటించాయి. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. అయితే సెమీ కండక్టర్ల తయారీలో వేదాంతతోపాటు ఫాక్స్‌కాన్‌కు కూడా సాంకేతిక పరిజ్ఞానం లేదు. దీంతో మూడో కంపెనీని టెక్నాలజీ పార్టనర్‌గా చేర్చుకోవాలని నిర్ణయించాయి. దీనికి కేంద్రం కూడా అనుమతించింది. ఈ క్రమంలో ఐరోపాకు చెందిన ఎస్టీమైక్రో ఎలక్ట్రానిక్స్‌ను సాంకేతిక భాగస్వామిగా చేర్చుకోవడానికి సిద్ధపడ్డాయి. కానీ టెక్నాలజీ పార్టనర్‌గానే కాకుండా ప్రాజెక్టులోనూ ఎస్టీమైక్రోను భాగం చేసుకోవాలంటూ కేంద్రం మెలిక పెట్టింది. దీనికి ఫాక్స్‌కాన్ అడ్డుచెప్పింది. ఎస్టీమైక్రో కూడా ఆసక్తి కనబర్చలేదు. ఈ నేపథ్యంలో పీఎల్‌ఐ స్కీమ్ కింద ప్రాజెక్టుకు ప్రోత్సాహకాలను కేంద్రం నిలిపేసింది. కేంద్రం కొర్రీలు, ఇతర దేశాల్లో కొత్త ప్రాజెక్టులపై ఈ వెంచర్ ప్రభావం పడుతుండటం, కంపెనీ ట్రాక్ రికార్డు దెబ్బతినే సూచనలు.. ఇవన్నీ ఈ ప్రాజెక్టు నుంచి ఫాక్స్‌కాన్ తప్పుకోవడానికి కారణాలుగా సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఎస్టీమైక్రో నుంచి కొన్నిరోజుల క్రితమే ట్విన్‌స్టార్ టెక్నాలజీ అనే కంపెనీ సెమీ కండక్టర్ తయారీ సాంకేతికతను అందిపుచ్చుకొన్నది. ఈ కంపెనీనే గతవారం వేదాంత కొనుగోలు చేసింది. దీంతో సెమీకండక్టర్ తయారీ సాంకేతికతను వేదాంత అందిపుచ్చుకొన్నట్లయింది. ఈ వెంచర్ నుంచి ఫాక్స్‌కాన్ తప్పుకోవడానికి ఇది కూడా ఓ కారణం కావొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. చిప్ అసెంబ్లింగ్, ప్యాకేజింగ్ కోసం రూ.22,717 కోట్లతో అమెరికా కంపెనీ మైక్రాన్ టెక్నాలజీస్‌తో కేంద్రం ఇటీవల ఓ ఒప్పందాన్ని కుదుర్చుకొంది. గుజరాత్‌లో ఏర్పాటు చేయనున్న ఈ కంపెనీ కోసం 70 శాతం సబ్సిడీ ఇవ్వనున్నది. అంటే వేదాంత కంపెనీ తయారు చేయబోయే సెమీ కండక్టర్లు మైక్రాన్ బ్రాంచీలో అసెంబ్లింగ్ కాబోతున్నాయి. వీటన్నింటిని విశ్లేషిస్తే.. రూ.1.26 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయిన వేదాంతను ఒడ్డుకు చేర్చి.. రానున్న ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే బీజేపీ ప్రభుత్వం.. రూ.1.6 లక్షల కోట్ల విలువైన జేవీ నుంచి ఫాక్స్‌కాన్‌ను తప్పించి.. మొత్తం ప్రాజెక్టును వేదాంతకు కట్టబెట్టేలా చేసిందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వెంచర్ నుంచి ఫాక్స్‌కాన్ వైదొలిగిన నేపథ్యంలో వేదాంత కీలక ప్రకటన చేసింది. ఇతర భాగస్వాములతో చేతులు కలిపి వెంచర్‌ను ముందుకు తీసుకెళ్తామని వెల్లడించింది. చిప్ ప్లాంట్ ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపింది. 40 ఎన్‌ఎం గ్రేడ్ టెక్నాలజీ చిప్స్ తయారీకి తమకు లైసెన్స్ ఉందని పేర్కొంది.