హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరభద్ర సింగ్ ఈ ఉదయం కన్నుమూశారు. అయన వయస్సు 87 సంవత్సరాలు. కోవిడ్ అనంతర వ్యాధులతో బాధపడుతూ కొంత కాలంగా షిమ్లా లోని ఇందిరాగాంధి మెడికల్ కాలేజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏప్రిల్ 13న అయన కోవిడ్ బారిన పడి మొహాలీలోని మాక్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకొని కోలుకున్నారు. కొంత కాలానికే కోవిడ్ అనంతరం తలెత్తే అనారోగ్య కారణాలతో మళ్ళీ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.
సుదీర్ఘ రాజకీయ జీవితంలో అయన నాలుగు పర్యాయాలు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. తొమ్మిదిసార్లు హిమాచల్ అసెంబ్లీకి, ఐదుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఇందిరాగాంధీ మంత్రివర్గంలో పర్యాటకం, పౌర విమాన యానం, పరిశ్రమల శాఖలను నిర్వహించారు. మన్మోహన్ ప్రభుత్వంలో ఉక్కు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. వీరభద్ర సింగ్ మృతికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
వీరభద్ర సింగ్ రాష్ట్రానికి చేసిన సేవలకు గాను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. నేటి నుంచి (జూలై 8) ఎల్లుండి (జూలై 10) వరకు రాష్ట్రంలో అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.