Media feels: ఉపరాష్ట్రపతిగా రెండోసారి అవకాశం ఇవ్వకపోవడం కంటే, రాష్ట్రపతిగా పదోన్నతి కల్పించకపోవడం కంటే…ముప్పవరపు వెంకయ్య నాయుడు బాధపడాల్సిన అంశం- తెలుగు పత్రికల అభిమాన పూర్వక ఆవేదనతో కూడిన జాలి సహిత నిట్టూర్పులో నుండి పుట్టిన వైరాగ్యం.
తప్పో? ఒప్పో? జానేదో. మోడీ- అమిత్ షా ల బి జె పి కి ప్రతి విషయంలో స్పష్టత ఉంటుంది. గోప్యత ఉంటుంది. ఎత్తుగడ ఉంటుంది. దీర్ఘకాల వ్యూహం ఉంటుంది.
బి జె పి కి బ్రాహ్మిణ్, బనియా అగ్రవర్ణ ముద్ర తొలగించడానికి వారు ఇప్పటికే ఏమేమి చేశారో లోకానికి తెలుసు. ఇకపై చేయబోయేదాని మీద కూడా వారికి క్లారిటీ ఉంది. ఆ ప్రయత్నంలోనే గిరిజన మహిళ రాష్ట్రపతి కాబోతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే జగదీప్ ఉపరాష్ట్రపతి కాబోతున్నారు.
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తో పాటు ఉత్తర భారతం రైతు ఉద్యమాలతో అట్టుడికిపోయింది. ఈ ఉద్యమాల్లో ప్రాణాలకు తెగించి పోరాడింది జాట్ లు. రానున్న రాజస్థాన్ ఎన్నికలతో పాటు జాట్ ల ప్రభావం అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో నష్ట నివారణకు జాట్ లకు ఉన్నత పదవి ఇవ్వడం, దాని మీద విస్తృత చర్చ జరగడం అవసరం. ఆ కోణంలో జగదీప్ ఉపరాష్ట్రపతి అవుతున్నారు. రైతు బిడ్డ జగదీప్ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థి అని మీడియాకు ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు జె పి నడ్డాకయినా ఆ విషయం ముందుగా తెలుసో? లేదో?
వెంటనే “కిసాన్ పుత్ర” రైతు బిడ్డ అంటూ ప్రధాని మోడీ జగదీప్ ను ఆకాశానికెత్తారు. ఇదంతా ఒక పకడ్బందీ వ్యూహం. వెంకయ్యకు రెండోసారి అవకాశం, తమిళసై పేరు పరిశీలన, నక్వీకి అరుదయిన అవకాశం లాంటి వార్తలు చూసి మోడీ- షా కడుపుబ్బా నవ్వుకుని ఉంటారు. ఒకపక్క జగదీప్ ఢిల్లీకి వచ్చి అమిత్ షా ను కలిసినా ఆయన పేరు వారు అధికారికంగా ప్రకటించేదాకా చర్చలోకి రాకుండా పావులు కదిపినందుకు మోడీ- షాలను వారి ప్రత్యర్థులు కూడా అభినందించాలి. అలా రాజకీయ వ్యూహాలను ఎలా అమలు చేయాలో నేర్చుకోవాలి.
వీలయితే వెంకయ్య ఒక బహిరంగ ప్రకటన చేస్తే తప్ప…మీడియా అభిమాన వార్తల ప్రవాహం ఆగేలా లేదు.
చెబితే బాగోదు కానీ… మోడీ- అమిత్ షాల ముందు భాష, భావం, బాడీ లాంగ్వేజ్, చేసినవి, చేయబోయేవి, చేయాలనుకుని చేయలేకపోయినవి, చేస్తారేమో అని వారనుకున్నవి…ఇలా ఏ లెక్కకు ఆ లెక్కలు విడి విడిగా అన్నీ ఉంటాయి. ఇది తెలుగు మీడియా అభిమానానికి కూడా తెలుసు. కానీ ఏమీ తెలియనట్లు బాధపడుతుంది.
“పెనుగాలికి గునపాలే కొట్టుకుపోతుంటే…
గుండు సూది కొట్టుకుపోతోందని గుండెలు బాదుకున్నారట…”
అని తెలుగులో సామెత బాధ!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :